అమరావతి : ఏపీ ఎస్ఐఆర్ ముసాయిదా ఓటరు జాబితా ( AP SIR Draft ) ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది . మొత్తం 4.16 కోట్ల ఓటర్లలో 89.22 శాతం 3.71 కోట్ల మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించారని సీఈవో వివేక్ యాదవ్ ( CEO Vivek Yadav ) పేర్కొన్నారు. 15.22 లక్షల మంది మృతులుగా గుర్తించామని వివరించారు. 22.30 లక్షల మంది శాశ్వతంగా అడ్రసులు మారడం లేదా గైర్హాజరయ్యారని గుర్తించినట్లు తెలిపారు.
7.37 లక్షల మంది పేర్లు రెండు, మూడు చోట్ల నమోదైనట్లు గుర్తించామని తెలిపారు. ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు ఉన్నవారి పేరును ఒకే చోట కొనసాగిస్తామని తెలిపారు. నిజమైన ఓటర్లు ఫారం-6తో మళ్లీ నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ చేపడుతామన్నారు. అక్టోబర్ 3న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని తెలిపారు.
రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేశామని, ముసాయిదా జాబితాను ఈసీఐ నెట్ యాప్, సీఈవో వెబ్సైట్లో పరిశీలించవచ్చని వె ల్లడించారు. నోటీసు, విచారణ లేకుండా ఏ ఓటరు పేరును తొలగించబోమని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. అర్హులెవరూ మిస్ కాకుండా ఈసీ కట్టుబడి ఉందని సీఈవో వివేక్ యాదవ్ తెలిపారు.