మోర్తాడ్, జూన్ 15: యూరియా ఇవ్వడం చేతకాకపోతే సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే గద్దె దిగిపోవాలని రైతులు డిమాండ్ చేశారు. యూరియా యాప్ విధానం రద్దు చేయాలని, ఎరువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ మోర్తాడ్ మండలం దొన్కల్ ఎక్స్‌రోడ్డు వద్ద జాతీయరహదారిపై దొన్కల్, ధర్మోరా, శెట్పల్లి గ్రామాల రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ…యాప్ విధానంతో రైతులకు యూరియా దొరకడం లేదన్నారు. పంటలకు సమయానికి యూరియా వేయలేని పరిస్థితి ఏర్పడుతున్నదని, మండలానికి ఒక యూనిట్‌గా తీసుకోవడంతో తమ గ్రామాల్లో యూరియా ఉన్నా దొరకని పరిస్థితి దాపురించిందన్నారు.
నిమిషాల వ్యవధిలో ఉన్న స్టాక్ జీరోగా చూపిస్తున్నదని, ఇక యాప్ లేని వారి పరిస్థితి, యాప్‌ను వినియోగించే విధానం తెలియని వారి పరిస్థితి మరీ దారుణంగా ఉన్నదని వాపోయారు. ప్రభుత్వానికి రుణమాఫీ, రైతుబంధు ఇవ్వడం చేతకావడంలేదని, కనీసం యూరియా కూడా ఇవ్వడం చేతకాకపోతే రేవంత్‌రెడ్డి గద్దెదిగిపోతే తాము ప్రభుత్వాన్ని నడిపిస్తామంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాప్ విధానాన్ని రద్దు చేయడంతో పాటు ప్రతి గ్రామంలో యూరియా అందుబాటులో ఉంచి ఎకరానికి 4 బస్తాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎరువుల ధరలను తగ్గించాలని, వ్యవసాయానికి విద్యుత్ తగినంత సరఫరా చేయాలని కోరారు. కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చే వరకు రాస్తారోకో విరమించబోమని రైతులు స్పష్టం చేశారు.
ఏవో హరీశ్‌కుమార్, ఇన్చార్జి తహసీల్దార్ అచ్యుతరెడ్డి రైతుల వద్దకు చేరుకొని సముదాయించగా, కలెక్టర్ రావాలి అంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఆర్మూర్ సబ్‌కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా రైతుల వద్దకు చేరుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. యాప్విధానంతో సమస్యలు వస్తున్నాయని తమ దృష్టికి వచ్చిందని ఈ విషయాన్ని కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పారు. రైతులకు అవసరమున్న యూరియా మంగళవారం వరకు తెప్పిస్తానని హామీ ఇచ్చారు. యూరియా తమ గ్రామాలకు రాకపోతే మళ్లీ ఆందోళన చేపడుతామని రైతులు స్పష్టం చేశారు. రెండుగంటలపాటు రాస్తారోకో చేపట్టడంతో వందలాది వాహనాలు నిలిచిపోయాయి.