భీమ్‌గల్, జూన్ 14: రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యూరియా యాప్‌తో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామ, తక్షణమే ఆ యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. మండలంలోని జాగిర్యాల్ గ్రామంలో ఆదివారం సొసైటీ గోదామును ముట్టడించారు. గోదాము షట్టన్ను కిందికి దించి నిరసన వ్యక్తంచేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. యాప్ వినియోగంపై చాలా మందికి అవగాహన లేదని, స్మార్ట్ ఫోన్లు కూడా లేవన్నారు. దీంతో యూరియా అందక తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. వెంటనే యాప్‌ను రద్దు చేయాలని లేనిపక్షంలో ప్రభుత్వం రైతుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. గోదాము ఎదుట రైతు ఐక్యత వర్ధిల్లాలి, జై జవాన్, జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ గడాల ప్రసాద్, రైతులు పాల్గొన్నారు.