– ఏఐఎస్ఎఫ్ భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వరక అజిత్
కొత్తగూడెం గణేష్ టెంపుల్, జూలై 23 : రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వరక అజిత్ విమర్శించారు. విద్యార్థుల హక్కులను కాలరాస్తూ, ప్రభుత్వ విద్యను బలహీనపరిచే విధానాలను కొనసాగిస్తే విద్యార్థుల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని, “విద్యార్థులతో పెట్టుకుంటే ప్రభుత్వ పతనం తప్పదు” అని హెచ్చరించారు. విద్యారంగ సమస్యల సమస్యల పరిష్కారం కోసం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి విజయవంతమైంది. వేలాది మంది విద్యార్థులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఒకానొక దశలు కలెక్టరేట్ ద్వారా గేటును తోసుకుంటూ లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు దీంతో ఏఐఎస్ఎఫ్ జెండాలు పట్టుకొని పలువురు విద్యార్థులు గేట్లు ఎక్కి నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా అజిత్ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ అందక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారు చదువులకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ రోజురోజుకూ సంక్షోభంలోకి నెట్టబడుతోందని, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, అధ్యాపకుల కొరత, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాల లేమి కారణంగా నాణ్యమైన విద్య దూరమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి వెంటనే పూర్తి స్థాయి విద్యాశాఖ మంత్రిని నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యా రంగానికి దిశానిర్దేశం చేసే నాయకత్వం లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను ఆర్థికంగా దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. ఈ పరిస్థితిని అరికట్టేందుకు తెలంగాణలో ఫీజు నియంత్రణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల ఫీజులపై ప్రభుత్వం కఠిన నియంత్రణ తీసుకురావాలని డిమాండ్ చేశారు.
విద్యాహక్కు చట్టాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో సమర్థవంతంగా అమలు చేయాలని, పెద్ద విద్యార్థులకు ఉచితంగా 25% సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడం ప్రభుత్వ రాజ్యాంగబద్ధ బాధ్యత అని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించే వరకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమాలు కొనసాగుతాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యా రంగాన్ని గాడిలో పెట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అజిత్ డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఏఓ కృష్ణ ప్రసాద్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శులు ఇనపల్లి పవన్ సాయి, గుండల సుజన్, మాణిక్యాల వినయ్, గుగులోత్ వంశీ, జిల్లా ఉపాధ్యక్షులు అక్కినపల్లి నాగేంద్రబాబు, కొరిమీ సంజయ్ పాల్గొన్నారు.