ఎర్రుపాలెం, జూలై 23 : కేజీబీవీ, యూఆర్ఎస్, సర్వశిక్ష ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలు చేసి, సేవలను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టి.ఎస్.యు.టి.ఎఫ్) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలోని కేజీబీవీలో పోస్టుకార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా టీఎస్‌యూటీఎఫ్ ఖమ్మం జిల్లా కార్యదర్శి అనుమోలు కోటేశ్వరరావు మాట్లాడుతూ… కేజీబీవీ, యూఆర్ఎస్, సర్వ శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్టుకార్డుల ద్వారా వినతిపత్రాలు పంపే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినట్లు తెలిపారు. గతంలో ముఖ్యమంత్రి ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
ఆ మేరకు ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ వర్తింపజేయడం, సేవలను రెగ్యులరైజ్ చేయడం, రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా సెలవు సౌకర్యాలు కల్పించడం, వార్షిక ఇంక్రిమెంట్లు మంజూరు చేయడం, హెల్త్ కార్డులు ఇవ్వడం, కేర్టేకర్లను నియమించి రాత్రి డ్యూటీల నుంచి మినహాయింపు కల్పించడం, 29 రోజుల సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలు చెల్లించడం, ఉద్యోగుల హోదాలకు అనుగుణంగా కేడర్ డిజైన్ చేయడం వంటి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ ఎర్రుపాలెం మండల అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాసరావు, మండల ప్రధాన కార్యదర్శి నండ్రు వెంకటేశ్వరరావు, రిటైర్డ్ ఉపాధ్యాయుడు బి.రాజారావు, మండల కమిటీ సభ్యుడు డి.వి.శ్రీనివాస్, కేజీబీవీ ఉద్యోగులు పాల్గొన్నారు.