హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ఒకటీ.. రెండు కాదు.. ప్రభుత్వానికి చెందాల్సిన రూ.10వేల కోట్ల విలువైన భూముల ధారాదత్తం నిలిచిపోయింది. హిల్ట్ ముసుగులో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ను ఆనుకొని ఉన్న విలువైన సర్కార్ భూములకు ఎసరు పెట్టేందుకు వేసిన స్కెచ్ బెడిసికొట్టింది. అనేక షరతులతో ప్రభుత్వం ఇచ్చిన భూములను దశాబ్దాలపాటు నిబంధనలకు అనుగుణంగా వినియోగించకపోవడం ఒకవంతైతే… ఆ భూములను కొల్లగొట్టి భారీగా రియల్ఎస్టేట్ దందా చేసేందుకు యాజమాన్యం పావు లు కదిపింది.
సదరు కుట్రను ‘నమస్తే తెలంగాణ’ బట్టబయలుచేయడంతో చివరికి ప్రభుత్వంలో కదలిక వచ్చింది. గోపన్‌పల్లి అల్యూమినియం ఫ్యాక్టరీ భూముల క్రమబద్ధ్దీకరణ ఫైల్‌ను నిలిపివేయాల్సిందిగా పరిశ్రమల శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఫైల్‌ను అబేయన్స్‌లో ఉంచాలని (తాత్కాలికంగా పక్కనపెట్టాలని) ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సంబంధిత అధికారులను ఆదేశించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
పరిశ్రమల శాఖ సమీక్ష
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి గ్రామ పరిధిలో అల్యూమినియం ఫ్యాక్టరీకి సర్వే నంబర్లు 95-97, 99/1, 99/2, 101/1, 101/2, 101/3ల్లో 100.35 ఎకరాల భూములున్నాయి. ఇందులో 53.14 ఎకరాలను భూసేకరణ ద్వారా రైతుల నుంచి సేకరించి పారిశ్రామికాభివృద్ధి కోసం 1967లో ఆ ఫ్యాక్టరీకి కేటాయించింది. భూ కేటాయింపునకు సంబంధించి రూపొందించిన సనద్ (ఒప్పంద డాక్యుమెంట్)లో ప్రభుత్వం స్పష్టమైన షరతులు విధించింది. ఆ భూములను పారిశ్రామిక అవసరాలకు మాత్రమే వినియోగించాలనే నిబంధన విధించడంతోపాటు షరతులు ఉల్లంఘిస్తే ఆ భూములు ప్రభుత్వానికి దఖలు పడుతాయని కూడా అందులో స్పష్టం చేసింది.
అయినప్పటికీ, దశాబ్దాలుగా యాజమాన్యం ఆ షరతులను ఉల్లంఘిస్తూ ఫ్యాక్టరీ భూములను సినిమా షూటింగ్‌లకు అద్దెకు ఇస్తూ ఏటా వందల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నది. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన హిల్ట్ పాలసీ కింద ఈ భూములను క్రమబద్ధీకరించుకొని పెద్ద ఎత్తున రియల్ఎస్టేట్ దందాకు తెరలేపేందుకు రంగం సిద్ధం చేశారు. దీంతో ‘నమస్తే తెలంగాణ’ ఈ కుట్రను బయటపెడుతూ ‘రూ.10వేల కోట్ల భూమికి ఎసరు’ శీర్షికన కథనాన్ని ప్రచురించడం సంచలనం సృష్టించింది.
ప్రభుత్వంలో దీనిపై పెద్దఎత్తున చర్చ జరిగింది. ముఖ్యంగా పరిశ్రమల శాఖ ఈ అంశంపై సోమవారం సమీక్షించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సంబంధిత శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శాఖ ఉన్నతాధికారులను దీనిపై అభిప్రాయాలను కోరినట్టు సమాచారం. ఈ సందర్భంగా భూముల చరిత్ర, భూ కేటాయింపు సమయంలోనే విధించిన షరతులు, వాటిని యాజమాన్యం ఉల్లంఘిస్తున్న తీరును ఉన్నతాధికారులు మంత్రి దృష్టికి తీసుకొనిపోయినట్టు తెలిసింది. వాస్తవానికి పరిశ్రమల అవసరాలకు మాత్రమే ఆ భూములను వినియోగించాలనే స్పష్టమైన షరతు ఉన్నందున దానిని ఉల్లంఘించిన యాజమాన్యం నుంచి ప్రభుత్వం భూమిని వెనక్కి తీసుకోవాల్సిందేననే అభిప్రాయాలు కూడా వ్యక్తమైనట్టు తెలుస్తున్నది.
చర్చకు వచ్చిన ఎస్బీఐ కేసు
ఇటీవల వివాదాస్పదమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ప్రస్తుతం ఎస్బీఐ) భూముల విషయం కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని సర్వే నంబర్ 83/1లో ఐదెకరాల భూమిని 2010లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ప్రస్తుతం ఎస్బీఐ)కు కేటాయించింది. కానీ, ఆ బ్యాంకు వినియోగించుకోకపోవడంతో ప్రభుత్వం ఆ భూమిని వెనక్కి తీసుకున్నది. ప్రభుత్వం కేటాయించిన భూమిని వినియోగించేందుకుగాను ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణాలు కూడా చేపట్టలేదని, కేటాయింపు సమయంలో విధించిన షరతు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకొని, వేలం వేసింది.
అదే భూమి వేలంలో ఎకరా రూ.267 కోట్ల చొప్పున సర్కార్ ఖజానాకు రూ.1,335 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థ ఎస్బీఐ విషయంలోనే ప్రభుత్వం నిబంధనలు, ఒప్పందాలను అమలు చేసి… ప్రైవేట్ యాజమాన్యం విషయంలో నిబంధనలు ఉ ల్లంఘించినా క్రమబద్ధీకరణ చేయడం తప్పు డు సంకేతాలు ఇచ్చినట్లవుతుందని ఉన్నతాధికారులు అభిప్రాయపడినట్టు సమాచారం. దీంతో హిల్ట్ కింద అల్యూమినియం ఫ్యాక్టరీ భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని పరిశ్రమల శాఖ నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారని, ఆ ఫైల్‌ను అబేయన్స్‌లో ఉంచాలని సూచించినట్టు తెలుస్తున్నది. దీంతో ప్రభుత్వానికి చెందిన రూ.10వేల కోట్ల విలువైన భూములు ధారాదత్తం కాకుండా నిలిచిపోయినట్టయ్యింది.