హైదరాబాద్, సెప్టెంబర్ 21(నమస్తే తెలంగాణ) : ఎగువన కర్ణాటక, దిగువన ఏపీ రా ష్ర్టాల్లో అక్కడి ప్రభుత్వాలు వచ్చిన జలాలను వచ్చినట్టు ఒడిసిపడుతుంటే.. మధ్యలో ఉన్న తెలంగాణ మాత్రం నీళ్ల కోసం తండ్లాడుతున్నది. ఎగువన కర్ణాటక రాష్ట్రంలో తుంగభద్ర, నారాయణపూర్ తదితర ప్రాజెక్టులకు సాగునీటిని సరఫరా చేస్తున్నారు. దిగువన ఏపీ సైతం కృష్ణా బేసిన్‌కు 700 కి.మీ దూరంలో ఉన్న కుప్పం నియోజకవర్గం వరకు జలాలను తరలిస్తున్నది. కానీ కృష్ణమ్మ చెంతనే ఉన్న జూ రాల ఆయకట్టుకు మాత్రం కాంగ్రెస్ సర్కార్ అందించలేకపోతున్నది. అదేమంటే కరువు కాలమంటూ నెపం మోపి చేతులు ఎత్తేసింది.
కృష్ణా బేసిన్లో ఎగువన కర్ణాటక, మహారాష్ట్ర ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఇప్పటికీ సమృద్ధిగానే ఉన్నాయి. కర్ణాటకలో ఆల్మట్టి రిజర్వాయర్ పూర్తిస్థామర్థ్యం 129 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 124టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రాజెక్టు నుంచి కర్ణాటక 12 టీఎంసీలను వినియోగించుకున్నది. ఇక్కడినుంచి దిగువన నారాయణపూర్ ప్రాజెక్టుకు 233 టీఎంసీలు విడుదల చేసింది. ఈ ప్రాజెక్టు వద్ద కర్ణాటక 55 టీఎంసీలు వాడుకున్నది. ప్రస్తుతం ఇందులోనూ 30టీఎంసీలు ఉన్నాయి.
అవిపోగా 218 టీఎంసీలను దిగువన జూరాలకు విడుదల చేసింది. ఇక తుంగభద్ర రిజర్వాయర్‌లోనూ కర్ణాటక 35 టీఎంసీలు వినియోగించుకొని దిగువకు 39 టీఎంసీలను విడుదల చేసింది. ప్రస్తుతం కర్ణాటకలో కృష్ణా బేసిన్లోనే దాదాపు 200 టీఎంసీల నిల్వలు ఉన్నాయి. వరదలు రావడం మొదలుకాగానే కర్ణాటక రాష్ట్రం ఆయా ప్రాజెక్టుల ప్రధాన కాలువలను తెరిచి నీటి విడుదలను ప్రారంభించింది. చెరువులను నింపుకొన్నది. అంతేగాక ఎత్తిపోతలను ప్రారంభించి ఇతర రిజర్వాయర్లను నింపుకొన్నది. రైతులకు పూర్తిస్థాయిలో కాకపోయినా ప్రధాన ఆయకట్టుకు సా గునీటిని అందిస్తున్నది. మహారాష్ట్ర సైతం ఉజ్జయిని నుంచి జలాలను వినియోగించుకున్నది.
ఇక దిగువన ఏపీ సైతం వచ్చిన జలాలను వచ్చినట్టు వినియోగించుకుంటున్నది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఆగస్టు మొదటి వారం నుంచే ప్రవాహాలు ప్రారంభమయ్యాయి. అనుమతులు తీసుకోకుండానే పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ నీటి మళ్లింపులను చేపట్టింది. శ్రీశైలం ప్రాజెక్టుపై ఉన్న మల్యాల, ముచ్చుమర్రి లిఫ్ట్‌లతోపాటు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా జలాల మళ్లింపును చేపట్టింది. అదేవిధంగా ఈ ఏడాదే వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి దానినుంచీ నీటిమళ్లింపును ప్రారంభించింది.
అంతేకాదు దిగువన సాగర్ నుంచి జలాలను ఒడిసిపట్టింది. మరోవైపు గోదావరి నుంచి సైతం జలాలను పట్టిసీమ, తాడిపూడి తదితర లిఫ్ట్‌ల ద్వారా ఎత్తిపోసి కృష్ణా డెల్టాకు అందిస్తున్నది. పెన్నా బేసిన్‌లోని చెరువులు, రిజర్వాయర్లకు జలాలను తరలిస్తున్నది. సీమ జిల్లాలో మినహా కృష్ణా డెల్టా, గోదావరి బేసిన్లో క్రాప్‌హాలిడేను ఏపీ ప్రకటించలేదు. రాయలసీమలోనూ తాగునీటికి సమృద్ధిగా జలాలను నిల్వ చేసుకున్నది.
కృష్ణా, గోదావరి బేసిన్లలో ముందుగానే ప్రభుత్వం క్రాప్‌హాలిడేను ప్రకటించింది. ఇక ఎగువ నుంచి ఈ ఏడాది కృష్ణాలో ఇప్పటివరకు మొత్తంగా 318 టీఎంసీలు వచ్చాయి. అందులో ఇప్పటివరకు తెలంగాణ, ఏపీ రెండు రాష్ర్టాలు కలిపి 127టీఎంసీలను వినియోగించుకున్నాయి. అందులో ఏపీ ఒక్కటే దాదాపు 84 టీఎంసీలను వినియోగించుకున్నదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒక్క శ్రీశైలం నుంచే ఏపీ 54టీఎంసీలను వినియోగించుకోగా, తెలంగాణ మాత్రం కల్వకుర్తి ద్వారా పట్టుమని 10 టీఎంసీలను ఎత్తలేదు.
ప్రస్తుతం సాగర్, శ్రీశైలం ఆ రెండు రిజర్వాయర్లలో 185 టీఎంసీలు ఉండగా, అందులో వినియోగానికి అందుబాటులో ఉన్నది కేవలం 100 టీఎంసీలే. ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. సగానికిపైగా చెరువులు వెలవెలబోతున్నాయి. వెరసి భూగర్భజలాలు అడుగంటిపోతున్నా యి. ఇప్పటికీ శ్రీశైలం, సాగర్ నుంచి ఏపీ జలాలను తరలిస్తున్నా తెలంగాణ సర్కార్ మాత్రం కరెంటు సరఫరా చేయకుండా లిఫ్ట్ స్కీములను పడావు పెడుతున్నది.