టెహ్రాన్: అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు(Iran Strikes) కొనసాగిస్తూనే ఉన్నది. అయితే తాజాగా గురువారం జరిగిన దాడిలో అమెరికా తన ఆయుధాలను కోల్పోయినట్లు తెలుస్తోంది. కువైట్, జోర్డాన్‌లో ఉన్న అమెరికా ఆయుధాలపై ఇరాన్ ప్రతీకార దాడులు చేసింది. అయితే కువైట్‌లో ఉన్న అమెరికన్ పేట్రియాట్ డిఫెన్స్ సిస్టమ్, ఎంక్యూ-9 డ్రోన్ డీపో, జోర్డాన్‌లో ఉన్న థాడ్ రేడార్ సిస్టమ్ ధ్వంసమైనట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ ప్రభుత్వ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికా పదేపదే దాడులు చేస్తున్న నేపథ్యంలో ప్రతీకారంగా జోర్డాన్‌లో ఉన్న అమెరికా స్థావరాలపై అటాక్ చేసినట్లు ఇరాన్ పేర్కొన్నది.
జోర్డాన్‌లో ఉన్న అమెరికా థాడ్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్‌ను మెరుపు వేగంతో నాశనం చేశామని ఐఆర్జీసీ తన ప్రకటనలో తెలిపింది. పేట్రియాట్ సిస్టమ్, సీ-రామ్ రేడార్‌ను కూడా ధ్వంసం చేశామని ఐఆర్జీసీ పేర్కొన్నది. ఓ భారీ హెలికాప్టర్ ఎక్విప్మెంట్ వేర్‌హౌజ్‌ను కూడా ధ్వంసం చేసినట్లు ఇరాన్ చెబుతోంది. అక్కడ హెలికాప్టర్లను రిపేర్ చేస్తారు. ఆపరేషన్ లైటనింగ్ పేరుతో సాగుతున్న దాడుల్లో కువైట్‌లో ఉన్న మూడు అమెరికా బేస్‌లు ధ్వంసమైనట్లు ఇరాన్ ఆర్మీ తెలిపింది.
దోహా బేస్‌లో ఉన్న అమ్యూనిషన్, లాజిస్టిక్స్ డిపోలను తమ డ్రోన్లు పేల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. కువైట్‌లో ఉన్న అలీ అల్ సలీం ఎయిర్‌బేస్‌ను టార్గెట్ చేసినట్లు ఐఆర్జీసీ తెలిపింది. అక్కడ ఉన్న పేట్రియాట్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్‌తో పాటు ఎంక్యూ-9 డ్రోన్లకు చెందిన హ్యాంగర్‌ను పేల్చివేసినట్లు చెప్పింది.