చందూర్, ఏప్రిల్ 11: ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. మండలంలోని లక్ష్మాపూర్ సొసైటీ వద్ద మేడ్పల్లి, కారేగాం, లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన రైతులు కేంద్రం నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ధాన్యం కోసి వారం రోజులు దాటినా కొనుగోలు చేయకుండా సంబంధీకులవి మాత్రమే కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతులందరినీ సమానంగా చూడాలన్నారు. ధాన్యం నింపడానికి గన్నీ సంచులు లేవన్నారు.
అకాల వర్షాలతో ఆరబోసిన ధాన్యాన్ని కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నామని వాపోయారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ సంచులను అందుబాటులో ఉంచాలని, ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న చందూర్ సొసైటీ చైర్మన్ ప్యారం అశోక్ అక్కడికి చేరుకున్నారు. కేంద్రం నిర్వాహకుల నిర్లక్ష్యానికి క్షమించాలని, ఇలాంటి తప్పిదాలను జరగకుండా చూస్తామని రైతులకు హామీ ఇచ్చారు. సొసైటీ వైస్ చైర్మన్ తారాసింగ్, కార్యదర్శి భూమయ్య, సొసైటీ మాజీ చైర్మన్ చంద్రునాయక్ , చత్రుసింగ్, డైరెక్టర్లు పాల్గొన్నారు.