Nizamabad | కంఠేశ్వర్, మే 26 : తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్నదాతలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అకాల వర్షానికి తడిసి ములకలెత్తిన ధాన్యాన్ని చూపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ప్రజావాణిలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పండిన పంటలు మొలకెత్తి సర్వనాశనం అవుతున్నాయని, ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అకాల వర్షాలకు తడిసి మొలకలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం ఎటువంటి తరుగు లేకుండా కొనుగోలు చేస్తామని చెప్పిందని, అయినా కూడా రైస్ మిల్లులు వ్యాపారులు ఒక్కో బస్తాకు ఎనిమిది నుండి పది కిలో తరుగు తీస్తామని చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలులో జాప్యం చూపుతూ పూర్తిగా ప్రభుత్వ నిర్లక్షంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్నా అకాల వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల్లో, రైతుల వద్ద ఉన్న ధాన్యం తడిసిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, మే మొదటి వారంలో తూకం వేసిన దాన్ని కూడా ఇప్పటివరకు లారీల్లో లోడ్ చేయలేదని, ధాన్యం తరలించడంలో లారీల కొలతలు అధికారుల నిర్లక్ష్యం స్పష్టం గా కనబడుతుందని అన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు ప్రమేయం ఉండడం, అనుభవం లేని వారికి ధాన్యం కొనుగోలు కేంద్రాలు అప్పగించడం వల్ల త్వరితగతిన రైతు నుంచి ధాన్యం కొనుగోలు జరగడం లేదని అన్నారున. కలెక్టర్ స్పందించి కొనుగోలు కేంద్రాల్లో, రైతుల వద్ద ఉన్న రూ.3.60 లక్షల మెట్రిక్ ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కురాచారి, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.