బోధన్, నవంబర్ 20 : మంజీరా నదిలోని బోధన్ మండలం సిద్ధ్దాపూర్ వద్ద ఉన్న ఇసుక క్వారీ ట్రాక్టర్లను రైతులు బుధవారం అడ్డుకున్నారు. సిద్ధాపూర్ గ్రామ సమీపంలోని ఇసుక క్వారీ నుంచి ఇసుకను తీసుకువస్తున్న ట్రాక్టర్లను సిద్ధాపూర్ గ్రామ రైతులు అడ్డుకున్నారు. వీరిలో మహిళా రైతులు ముందుండి తమ పొలాల వద్ద ఇసుక లోడ్‌తో వస్తున్న ట్రాక్టర్లను నిలిపివేశారు.
క్వారీ నుంచి వచ్చే ఇసుక ట్రాక్టర్లతో తమ పంట పొలాలకు ఫిల్టర్ పాయింట్స్ (తక్కువ లోతు బోరువెల్స్) నుంచి వచ్చే పైపులైన్లు పగిలిపోతున్నాయని, పొలాల గట్లు తెగిపోతున్నాయని ఆందోళనకు దిగిన రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇసుక ట్రాక్టర్ల ద్వారా వచ్చే దుమ్ము, ధూళితో పొగాకు దెబ్బతింటున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
కోతలు పూర్తయిన వరి పొలాల రైతులు కూడా ఇసుక ట్రాక్టర్ల ద్వారా నేల గట్టిపడి ఇబ్బందులు పడుతున్నామన్నారు. రైతుల ఆందోళనతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ట్రాక్టర్లు క్వారీలోనే నిలిచిపోయాయి. క్వారీకి సంబంధించిన నిర్వాహకులు, ట్రాక్టర్ల యజమానులు రైతులను బతిమిలాడినప్పటికీ, ఇసుక ట్రాక్టర్లు బయటికి వెళ్లడానికి సాయంత్రం వరకు ఒప్పుకోలేదు. చివరికి రైతులతో చర్చలు జరపడంతో సాయంత్రం సమస్య పరిష్కామయ్యింది. మరోసారి ఇసుక ట్రాక్టర్లు వస్తే ఊరుకోబోమని రైతులు హెచ్చరించారు.