బాన్సువాడ, జూన్ 29: వరుణుడు ముఖం చాటేయడంతో రైతాంగం ఆందోళన చెందుతున్నది. ఉమ్మడి జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ నుంచి నీటి విడుదల కోసం ఆశగా ఎదురు చూస్తున్నది. ఇప్పటికే బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల పరిధిలోని ఆయకట్టు కింద ఉన్న రైతులు నార్లు పోసుకున్నారు. నాట్లు వేసే సమయం ఆసన్నమవుతున్న తరుణంలో సాగునీరు లేకపోవడంతో అయోమయంలో పడ్డారు. ఏటా వానాకాలం ఆరంభంలోనే బాన్సువాడ ప్రాంత రైతులు ముందస్తుగా నారు పోస్తారు. అయితే, ఈసారి ఆశించిన మేర వర్షాలు లేకపోవడం, వానాకాలం ఆరంభమై నెల గడుస్తున్నా చిణుకు జాడ కరువవడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిపైనే ఆశలు పెట్టుకున్నారు.
నిజాంసాగర్ నుంచి నీటిని విడుదల చేస్తారని ఆయకట్టు రైతులు ఎదురు చూస్తు న్నారు. సాగర్ నుంచి నీళ్లు వదిలితే నాట్లు వేస్తామని చెబుతున్నారు. వర్షాలపై ఆశతో ముందస్తుగా నార్లు పోశామని, అయితే, ఇప్పుడు నార్లకు పెట్టేందుకు నీళ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. ఏపుగా పెరిగిన నారును కాపాడుకోవడం కష్టంగా మారిందని చెబుతున్నారు. సాగర్ నుంచి నీటిని విడుదల చేస్తే నార్లు బతికించుకోవడంతో పాటు నాట్లు వేయడానికి అవకాశం ఏర్పడుతుందని పేర్కొంటున్నారు. రైతుల శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం వెంటనే నీళ్లు విడుదల చేయాలని కోరుతున్నారు.