ధర్పల్లి, ఫిబ్రవరి 27 : దశాబ్ద కాలం వ్యవసాయాన్ని పండుగలా చేసుకొని ఆనందించిన రైతన్నలు నేడు ఆందోళన చెందుతున్నారు. ఏడాదికాలంగా సర్కారు నిర్లక్ష్యానికి గురై.. సాగు భారమై ఆగమాగమవుతున్నారు. పంటలకు చివరి తడు లు అందక అల్లాడిపోతున్నారు. వరి పంటలు వేసిన నేల.. నీరందక నెర్రెలు బారి పచ్చని పంట పొలాలు కండ్ల ఎదుటే ఎండిపోతుంటే ఏం చేయాలో తెలియక రైతన్నల గుండె తరుక్కు పోతున్నది. ఎన్ని ప్రయత్నాలు చేసినా పంటను రక్షించుకోలేక ఎండిన పంటను చూస్తూ తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ధర్పల్లి మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో యాసంగి పంటలు వేసిన రైతులకు కన్నీరే మిగులుతున్నది.
రోజురోజుకూ భూగర్భ జలాలు అడుగంటి పోతుండడంతో పంటలు సగానికి సగం ఎండిపోయే పరిస్థితి నెలకొన్నది. మండల కేంద్రంలోని భీమ్‌గల్ రోడ్డు వాడి, హోన్నాజీపేట్ గ్రామాల పరిధిలో, దుబ్బాక, గోవింద్‌పల్లి గుడి తండా గ్రామాల పరిధిలో వరికి నీరందక ఎండిపోతున్నాయి. ప్రస్తు తం చివరి తడుల కన్నా ముందుగానే పంటలకు నీరందక ఎండిపోవడం ఇదే మొదటిసారని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. చివరి తడులు మార్చి, ఏప్రిల్ వరకు అందక పం టలు ఎండిపోతుండే. కానీ ఫిబ్రవరిలోనే భూగర్భజలాలు అడుగంటిపోవడంతో బోర్లు వట్టిపోతున్నాయి. బోర్లలో నీరు రాక, వేసిన పంటలను రక్షించుకోలేక సగం పంటను పశువులకు మేత కోసం వదిలేస్తున్నారు. మిగతా సగం పంటలకే నీళ్లు పట్టిస్తూ కాపాడుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు.
పోలీసు బందోబస్తు మధ్య నీటి విడుదల
భూగర్భజల వనరులు అడుగంటిపోతుండడంతో చెరువుల నుంచి నీటి విడుదల చేయడానికి రైతులు ఒప్పుకోవడంలేదు. దీంతో అధికారులు పోలీసు బందోబస్తు మధ్య నీటిని విడుదల చేయాల్సి వచ్చిందంటే పరిస్థితులు ఎంత దిగజారుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. నడిమి తండా పరిధిలోని ముత్యాల వాగు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసేందుకు ఇరిగేషన్ అధికారులు వెళ్లగా.. నడిమి తండా వాసులు అడ్డుకొన్నారు. వారం రోజులైనా సమస్య కొలిక్కిరాకపోవడంతో గత శుక్రవారం ఇరిగేషన్ ఏఈ రాంప్రసాద్ పోలీసుల రక్షణతో ముత్యాల వాగు ప్రాజెక్టు నుంచి లక్ష్మీ చెరువు తండా, ఊర చెరువుకు నీటిని విడుదల చేయడం గమనార్హం.
వట్టిపోతున్న బోర్లు
మండలంలోని గుడితండాకు చెందిన రాంచందర్ అనే రైతుకు చెందిన బోరు 15 రోజుల క్రితమే నీళ్లు పోయడం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో 500 ఫీట్లు ఉన్న బోరును మరోమారు 815 ఫీట్ల వరకు తవ్వించగా నీరు అంతంత మాత్రమే రావడంతో తీవ్ర ఆవేదనకు లోనవుతున్నాడు. దుబ్బాక, హోన్నాజీపేట్ తండాల్లోనూ 700 నుంచి 750 ఫీట్ల వరకు బోర్లు వేసినా చుక్కనీరు రాని పరిస్థితి నెలకొన్నది.
పశువులకు మేతగా ..
సాగునీరందక చివరికి సగం పంటను పశువులకు దాణాగా వదిలేస్తున్నారు. లేదంటే పూర్తి పంట దెబ్బ తినే అవకాశం ఉన్నది. సగం పంటనైనా కాపాడుకోవాలన్న తాపత్రయంతో పచ్చగా ఎదిగి ఎండిపోతున్న వరి పంటను పశువులకు వదిలేస్తున్నారు. ధర్పల్లి కళాశాల తండాకు చెందిన కడావత్నంద్య అనే రైతు తన రెండెకరాల పొలంలో ఎకరం వరకు ఎండిపోవడంతో గొర్రెలు, పశువులకు దాణాగా వదిలేశాడు. ఇంతటి దుర్భర పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఏ ఒక్క అధికారి వచ్చి చూసిన పాపాన పోలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
నీరందక పశువులకు మేతగా వదిలేశా..
నాకున్న రెండెకరాల్లో ఏసిన వరి పంటకు నీళ్లందడంలేదు. దీంతో ఎకరం వరకు వరి పంటను గొడ్డుగోజాలకు తినడానికి ఇడిసిపెట్టిన. పొలం జూస్తే చానా బాధయితున్నది. కానీ కొంత పొలాన్ని ఇడిసిపెట్టకపోతే ఉన్న పొలం మొత్తం ఎండిపోయేటట్టుంది. అందుకే ఎకరం దాక పొలంను నీళ్లు లేక ఇడిసిపెట్టిన. సర్కార్ మమ్ములను ఆదుకోవాలి.
– కడవాత్ నంద్య, రైతు, కాలేజీ తండా, ధర్పల్లి
కౌలు చేసిన పొలం ఎండిపోయింది
నాకు కొంత వ్యవసాయ భూమి ఉన్నది. నేను ధర్పల్లిలోని చోటేమియా మాముళ్ల వద్ద రెండెకరాలు, ఇంకొళ్ల దగ్గర కౌలుకు తీసుకుని వరి పంట ఏసినా. దాంట్ల నీళ్లు సరిగ్గా లేక పంటలకు నీళ్లందక ఎండిపోతున్నది. ఉన్న పంటను కొంతైనా కాపాడుకుందామని ఎకరం కాపాడుతున్న. గవర్నమెంట్ మాలాంటి వాళ్లకు సాయం చేసి ఆదుకోవాలి.
– బదావత్ రాంజీ, రైతు, సీతాయిపేట్ గుడితండా, ధర్పల్లి