బోధన్, డిసెంబర్ 13 : మంజీరా నది తీరాన సిద్ధాపూర్ ఇసుక క్వారీలు రైతాంగం పాలిట శాపంగా మారాయి. క్వారీల నుంచి ఇసుక లోడ్‌తో వచ్చే టిప్పర్లు, ట్రాక్టర్లతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిద్ధాపూర్ వద్ద స్థానిక అవసరాల కోసం ప్రభుత్వం ట్రాక్టర్ల క్వారీని ఏర్పాటుచేసింది. సిద్దాపూర్ – ఖండ్గావ్ గ్రామాల మధ్య ప్రభుత్వ అభివృద్ధి పనుల కోసం ఇసుకను తీసుకెళ్లే టిప్పర్ల కోసం మరో క్వారీని నడుపుతున్నది. టిప్పర్ల క్వారీ నుంచి అధిక లోడ్‌తో వచ్చే వాహనాల వల్ల రోడ్లు ధ్వంసమవుతుండగా, ఇసుక లోడ్‌తో వచ్చే ట్రాక్టర్ల కారణంగా పంటలు దెబ్బ తింటున్నాయి. దీంతో స్థానిక ప్రజలు, ముఖ్యంగా రైతులు బెంబేలెత్తిపోతున్నారు. పైప్లైన్లు పగిలిపోతున్నాయని, రోడ్డు పక్కన పంటలు దుమ్మూధూళితో నిండిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు.
అధిక లోడ్‌తో వచ్చే ఇసుక ట్రాక్టర్లు పొలాల్లోకి చొచ్చుకువస్తున్నాయని రైతులు అంటున్నారు. దీంతో తమ పొలాల గట్లు ధ్వంసమవుతున్నాయని, నేల గట్టి పడితున్నదని చెబుతున్నారు. ఇసుక ట్రాక్టర్లు, టిప్పర్ల వల్ల దుమ్ము, ధూళి రేగడం, అవి పంటలపై పడడంతో పంటలకు నష్టం జరుగుతున్నది. క్వారీల నుంచి మెయిన్ రోడ్డు వరకు ఉన్న దారుల్లో దుమ్ము రేగకుండా ట్యాంకర్లతో నీళ్లను ఎప్పటికప్పుడు చిమ్ముతుండాలి. కానీ అలా జరగడంలేదు. తీవ్రంగా నష్టపోతున్న రైతులు పలుమార్లు ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు. అన్నదాతలకు అండగా ఉండాల్సిన అధికారులు వారికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ట్రాక్టర్లు ఆపితే కేసులు పెడతామంటూ పోలీసులు బెదిరిస్తున్నారని రైతులు వాపోతున్నారు.
ఇసుక క్వారీల కారణంగా రహదారులు ధ్వంసమవుతున్నాయి. సిద్దాపూర్‌లోని క్వారీల నుంచి వచ్చే ఇసుక ట్రాక్టర్లు, టిప్పర్లతో పాటు ఈ ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఇతర వాహనాలతో సిద్ధాపూర్ నుంచి కల్దుర్కి మీదుగా ఇటు బోధన్, అటు నిజామాబాద్‌కు వెళ్లే రోడ్లు అధ్వానంగా మారాయి. తాము చందాలు వేసుకుని రోడ్లపై గుంతలను పూడ్చివేస్తే ఇసుక వాహనాలతో రోడ్లు మళ్లీ పాడయిపోతున్నాయని ఆయా గ్రామాల ప్రజలు మొత్తుకుంటున్నారు.
అచ్చే సీజన్ల వరి నాటు వేద్దామని దున్నినం. దున్నిన చేన్లకెళ్లి ట్రాక్టర్లు తీసుకపోయిండ్రు. ట్రాక్టర్ల పోయిన జాగా మొత్తం గట్టిగా అయింది. ఇప్పుడు మళ్లా దున్నాలంటే మళ్లీ పైసలు పెట్టలె. దమ్ము చేసుడు కూడా కష్టమయితది. లేబర్ నాట్లు కూడా వెయ్యరు.. మస్తు ఖర్చయితది. మేం గరీబోళ్లం. కష్టంచేసి బతికేటోళ్లం. ఇట్ల చేస్తే ఎట్ల? అక్కడ ఏట్ల కూడా మాకు పైపులు ఉన్నాయి. ట్రాక్టర్లు పోవుడుతోని అవి కూడా పగిలినయ్. మాకు న్యాయం కావాలె..
ప్రభుత్వ అనుమతితో నడుస్తున్న క్వారీల్లో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. వందల సంఖ్యలో ట్రాక్టర్లతో ఇసుకను తరలించుకు పోతున్నారని, వాహనాల పరుగులతో దుమ్ము ధూళి రేగి పంటలు చెడిపోతున్నాయని వాపోతున్నారు. మంజీరా తీరాన ఇసుక అక్రమ తవ్వకాలపై ‘క్వారీల్లో అక్రమాల జాతర – నిబంధనలకు పాతర’ పేరిట ఇటీవల ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం ప్రచురించింది. దీంతో అధికార యంత్రాంగం కదలడంతో కొన్ని రోజులపాటు ఈ ఇసుక క్వారీలో తవ్వకాలు నిలిచి పోయాయి. మళ్లీ ఇటీవలే ఇసుక తవ్వకాలు ప్రారంభంకావడంతో వందలాది ట్రాక్టర్లు క్యూ కట్టాయి. దీంతో రైతుల్లో మళ్లీ కలవరం మొదలైంది. పెద్ద ఎత్తున ఇసుక ట్రాక్టర్లు వస్తుండడం, విచ్చలవిడిగా ఇసుక రవాణా జరుగుతుండడంతో మంజీరా తీరాన రైతులు వేసుకున్న పైపులైన్లు పగిలిపోతున్నాయి.
సిద్ధాపూర్, చుట్టుపక్కల గ్రామాల రైతులు సాగునీటి కోసం మంజీరా తీరంలో ఫిల్టర్ పాయింట్లపై ఆధారపడి పంటలను సాగు చేసుకుంటున్నారు. మంజీరా తీరాన రైతులు వేసుకునే ఈ ఫిల్టర్ పాయింట్లతో తక్కువ లోతులోనే భూగర్భజలాల లభ్యత ఉంటుంది. ఈ ఫిల్టర్ పాయింట్ల నుంచి పైపులైన్ల ద్వారా నీటిని పొలాలకు తీసుకెళ్తుంటారు. ఇసుక తవ్వకాలతో ఇప్పుడా ఫిల్టర్ పాయింట్లకు, పైప్లైన్లకు ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే అనేకమంది రైతుల పైప్లైన్లు పగిలి పోయాయి. ఒకపక్క భూగర్భజలాలు పడిపోతుండగా, మరోపక్క తాము వేసుకున్న పైపులైన్లు ధ్వంసమవుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ పైపులైన్లు వేసుకోవాలంటే వేలాది రూపాయలు ఖర్చవుతాయని అంటున్నారు. ఇప్పటికే పంటలు పండించడం భారంగా మారిందని, ఈ పరిస్థితుల్లో తాము మళ్లీ పైపులైన్లను వేసుకోవటమన్నది తమకు తలకు మించిన భారమవుతుందని వాపోతున్నారు.
– కాంతాబాయి, మహిళా రైతు, సిద్ధాపూర్
నా చేన్ల తంబాకు పెట్టిన.. గీ ఇసుక ట్రాక్టర్లతో దుమ్ము పడి పంట ఖరాబయ్యింది. పెట్టుబడి మస్తు పెట్టి తంబాకు నాటిన. ఇసుక ట్రాక్టరోళ్లు నా పంటను ఖరాబ్ చేసిండ్రు. నా పైపులైన్లు పగలగొట్టిండ్రు.. వైర్లు తెంపేసిండ్రు. పెట్టుబడి అంతా లాస్ అయిన. ఈ లాస్ ఎవరిస్తరు?
ఇసుక క్వారీ నుంచి ట్రాక్టర్లను విచ్చలవిడిగా నడుపుతున్నరు. చేన్లకు వచ్చే పైపులైన్లు పగిలిపోతున్నయి. రేపు మేము నాట్లు వేస్తే నీళ్లు ఎట్ల వస్తాయ్. పైపులైన్లు బాగుంటేనే నీళ్లు సరిగా అందక కష్టంగా వ్యవసాయం చేస్తున్నం. నాట్లు వేసిన తర్వాత కూడా పైపులైన్ పగిలిపోతే పంట ఎండిపోతుంది. వచ్చేది ఎండాకాలం. పంటలు ఎట్ల పండుతాయో తెలియడం లేదు. ఈ ఇసుక ట్రాక్టర్లను కంట్రోల్ చేయాలి. మా పంటలు దెబ్బతినకుండా చూడాలి.
– పీరాజీ, రైతు, సిద్ధ్దాపూర్