నిజామాబాద్, మే 26, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతులు ధైర్యం కోల్పోతున్నారు. అండదండ లేకపోవడంతో ఒంటరిగా మిలుగుతున్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ పదేళ్ల కాలంలో కాలు మీద కాలు వేసుకుని దర్జాగా పంటలు సాగు చేశారు. వ్యవసాయానికి అవసరమైన వనరులు చిటికెలో రైతు ముందట వాలిపోయేవి. యూరియా, ఎరువులు సకాలంలో అందేవి. సాగుకు పుష్కలంగా నీళ్లు అందుబాటులో కనిపించేవి. నాట్ల సమయానికే రైతుబంధు పేరిట పెట్టుబడి సాయం ఠంచనుగా అందేది.
ఇలా అడుగడుగునా రైతుకు ఇబ్బందులు లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన సాగించింది. రెండున్నరేళ్లు దాటిన ప్రజాపాలనలో రైతుకు కంట కన్నీరు తప్పా సంతోషం కనిపించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు ఆనందం ఆవిరైపోయింది. పుటం వేసే దగ్గరి నుంచి పంట అమ్ముకునే వరకు మొత్తం ప్రక్రియలో ఆటంకాలే ఎదురవుతున్నాయి. యూరియా కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ధాన్యం అమ్ముకునేందుకు రోజుల తరబడి కల్లాల్లోనే కాపు కాయాల్సి వస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే రైతుకు గడ్డు కాలమే దాపురించిందని గ్రామాల్లో చర్చించుకుంటున్నారు. కేసీఆర్ పాలనతో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పోల్చుకుంటున్నారు. రైతును రాజు చేసేందుకు కేసీఆర్ తండ్లాడితే… అన్నదాతలను ఆగం చేసేందుకు కాంగ్రెస్ పరిపాలన నడుస్తోందని సీఎం రేవంత్ రెడ్డిపై అంతటా నిప్పులు చెరుగుతున్నారు.
రైతు కన్నీరు మున్నీరు…
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నప్పటికీ ఫలితం లేదు. ఆదుకోవాల్సిన పాలకులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో ఈ విషయం స్పష్టంగా తేటతెల్లమైంది. ఉమ్మడి జిల్లాలో అధ్వాన పరిస్థితి కనిపిస్తే కనీసం పట్టించుకున్న నాథుడే కనిపించలేదు. ఇన్ఛార్జీ మంత్రిగా సీతక్క ఉన్నప్పటికీ రైతుల సమస్యలపై సమీక్షనే జరగలేదు. ధాన్యం కొనుగోళ్లు మొదలై నెలన్నర రోజులు గడిచిన తర్వాత ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి రివ్యూ నిర్వహించారు.
అకాల వర్షాలకు రైతులకు పంట నష్టం సంభవిస్తే వారిని ఆదుకునేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. మామిడి రైతులకు దిగుబడి భారీగా వచ్చినప్పటికీ లాభాలు దక్కలేదు. ఉత్పత్తి పెరిగి ధర పతనమైంది. మధ్యవర్తులకే మామిడి పంట ఈసారి కాసులు కురిపించింది. మామిడి తోటలు పెంచుతోన్న రైతులకు మాత్రం నిరాశే మిగిలింది. కాయలు అమ్ముకునేందుకు తండ్లాట తప్పలేదు. ధాన్యంతో పాటుగా జొన్న, మక్క రైతులు అడుగడుగునా రోడ్డు ఎక్కారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన మక్క, జొన్న కొనుగోళ్లలో వైఫల్యం కనిపించింది.
యాసంగి 2025-26లో యూరియా కోసం అష్టకష్టాలు పడ్డారు. యూరియా సంచి కోసం రోడ్డు ఎక్కి ధర్నాలు చేయాల్సి వచ్చింది. చెప్పులు వరుసలో పెట్టి రోజుల తరబడి వేచి చూశారు. సమయానికి పెట్టుబడి సాయం అందలేదు. పూర్తి స్థాయిలో సాయం చేస్తామని చెప్పి రెండు ఎకరాలకే సాయం అందించి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. వానాకాలం ముంచుకొస్తుండగా కాంగ్రెస్ సర్కార్‌పై రైతుల్లో నమ్మకం సడలి పోతోంది సాగుకు అడుగు ముందుకేయాలంటే భయంతో రైతులు వణికి పోతున్నారు.
వరి వైపే రైతుల మొగ్గు…
వానాకాలం 2026లో నిజామాబాద్ జిల్లాలో ఈసారి భారీగా వరి పంటనే సాగుకు నోచుకోనుంది. వ్యవసాయ శాఖ అంచనాల మేరకు మొత్తం 5లక్షల 30వేల 397 ఎకరాల్లో పంటలు సాగవ్వనుంది. ఇందులో ప్రధానంగా 4లక్షల 38వేల 521 ఎకరాల్లో వరి పంటలు వేసేందుకు రైతులు ఉత్సాహం చూపుతున్నట్లుగా వెల్లడైంది. 55వేల ఎకరాల్లో మొక్కజొన్న, 34,227 ఎకరాల్లో సోయాబీన్, 993 ఎకరాల్లో పత్తి, 994 ఎకరాల్లో కందులు, 195 ఎకరాల్లో సజ్జ పంట వేయనున్నారు. గతేడాది వానాకాలంలో వ్యవసాయ శాఖ అంచనాలు తలకిందులు అయ్యాయి.
2025 వానాకాలంలో మొత్తం 5లక్షల 18వేల 969 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనాలు సిద్ధం చేస్తే క్షేత్ర స్థాయి సర్వేలో 5లక్షల 28వేల 128 ఎకరాల్లో పంటలు సాగుకు నోచుకున్నాయి. ఇందులో వరి 4,12,164 ఎకరాల్లో అంచనాలు సిద్ధం చేయగా అందుకు భిన్నంగా 4,36,589 ఎకరాల్లో సాగైంది. వ్యవసాయ శాఖ వెల్లడిస్తోన్న సాగు అంచనాల్లో కచ్చితత్వం అన్నది లోపిస్తోంది. క్షేత్ర స్థాయిలో రైతుల అభిప్రాయాలకు భిన్నంగా ఆఫీస్ రూమ్‌ల్లో కూర్చుని అంచనాలు సిద్ధం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే అంచనాల్లో భారీ తేడా కనిపిస్తోంది. వానాకాలంలో ఎక్కువ మంది రైతులు సన్న రకం సాగువైపే దృష్టి సారిస్తారు. ఇంటి అవసరాలకు తోడుగా వానాకాలంలో సాగునీటి కొరత ఉండదనే కారణంతో సన్నాల వైపు రైతులు ఆకర్షితులు అవుతారు.
వ్యవసాయం కన్నా ఇతర పనులు చేసుకోవడమే మంచిదేమో!
ప్రస్తుత పరిస్థితిలో వ్యవసాయ చేయడం కన్నా ఇతర పనులు చేసుకోవడమే మంచిదేమో అనిపిస్తుంది. మొత్తం తూకాలు పూర్తికావాలంటే మరో పది రోజుల సమయం పట్టేలా ఉన్నది. రైతుభరోసా ఎకరాకు రూ.6వేలు ఇంతవరకు రాకపాయే. ఎన్నో ఇబ్బందుల నడుమ పంటల సాగు రైతుకు భారంగా మారింది.
-వేణుమాధవ్రావ్రెడ్డి, రైతు, పిట్లం