రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రారంభించిన రుణమాఫీ ప్రక్రియపై గందరగోళం నెలకొన్నది. ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు రైతులకు అయోమయానికి గురిచేస్తున్నాయి. లక్షలోపు రుణాలన్నీ మాఫీ చేస్తున్నామని ప్రకటించినప్పటికీ చాలా మంది రైతులకు లక్షలోపు రుణాలు ఉన్నా మాఫీ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. రేషన్‌కార్డులు లేని వారిలో కూడా అయోమయ పరిస్థితి నెలకొన్నది. ఎవరెవరికి వస్తాయి, ఎప్పుడు వస్తాయని కొందరు రైతులు, ఇచ్చుడు స్టార్టయ్యింది మాకు కూడా వస్తాయని మరికొందరు రైతులు ఆశాభావంతో ఉన్నారు. ఏది ఏమైనా రుణమాఫీ విషయంపై రైతుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా చాలా మంది రైతులు రుణమాఫీ వచ్చిందా లేదా అని బ్యాంకులకు వెళ్లి చెక్ చేయించుకుంటున్నారు.
-మోర్తాడ్/ ఖలీల్‌వాడి, జూలై 19
కమ్మర్‌పల్లికి చెందిన సంత రాజేశ్వర్ అనే రైతుకు రేషన్‌కార్డు లేదు. రేషన్‌కార్డు విషయంలో రుణమాఫీకి సంబంధించి అధికారులు ఎవరూ విచారణకు రాలేదు. ఆయన భార్య మల్లు పేరుమీద దక్కన్గ్రామీణ బ్యాంకులో రూ.99వేల రుణం ఉంది. అది మాఫీ కాలేదు. సంత రాజేశ్వర్ పేరున ఆంధ్రాబ్యాంకులో రూ.2లక్షల రుణం ఉంది. కుటుంబంలో ఇద్దరికి కలిపి దాదాపు రూ.3లక్షల రుణం బ్యాంకుల్లో ఉన్నది. ఇప్పుడు వీరు మాకు రుణమాఫీ వస్తుందా లేదా అనే సందిగ్ధంలో ఉన్నారు. లక్షలోపు వస్తే తన భార్యకు రావాల్సి ఉండేదని, కుటుంబానికి రూ.2లక్షలు ఇస్తే మొత్తంగా రెండులక్షలు వస్తుందని ఆశిస్తున్నారు. ఏది ఏమైనా రుణమాఫీ ప్రక్రియలో అస్పష్టత, అరకొర సమాచారం, ఎన్నో అనుమానాలు ఉన్నాయని, చివరకు రుణమాఫీ వస్తుందన్న ఆశ వారిలో నెలకొన్నది.
నేను 2023 జూలైలో లోన్ రెన్యువల్ చేసి రూ.44వేల అప్పు తీసుకున్నా. నాకు రుణ మాఫీ అవుతుందని ఆశగా ఎదురుచూసిన. మా ఊళ్ల కొంతమందికి మాఫీ అయ్యింది. కానీ నాకు కాలేదు. ప్రభుత్వం రుణమాఫీ చేసి ఆదుకోవాలి.
– శేషాబాయి, మల్లాపూర్
నేను లక్ష రూపాయలలోపు రుణం తీసుకున్నా.. కానీ నాకు రుణమాఫీ కాలేదు. నాకు రుణమాఫీ ఇస్తారో ఇవ్వరో కూడా తెలియని పరిస్థితి నెలకొన్నది. కొందరేమో రెండో విడుతలో వస్తుందని అంటున్నారు. అంతా అయోమయంగా ఉన్నది.
– ఎర్రోళ్ల సాయిలు, సిర్పూర్, మోపాల్ మండలం
రుణమాఫీకి సంబంధించి అధికారులు ఇచ్చిన జాబితా గందరగోళంగా ఉన్నది. నాకు మూడెకరాల భూమి ఉండగా.. రూ. 99వేల పంట రుణం తీసుకున్న.లక్ష లోపు వారికి మాఫీ అని చెప్పారు. కానీ అధికారులు ఇచ్చిన లిస్టులో నా పేరులేదు. రూ. 2 లక్షలలోపు రుణాలను ఏకకాలంలో మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కారు ఎలాంటి నిబంధనలు లేకుండా మాఫీ చేయాలి.
-గడ్డం సాయిలు, రైతు, బిచ్కుంద
ఆర్మూర్‌టౌన్, జూలై 19: మాది ఆర్మూర్. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో పంటపై లక్ష రూపాయల రుణం తీసుకున్నా. సీఎం రేవంత్ రెడ్డి లక్ష లోపు రుణం తీసుకున్న వారికి ఒకే దఫాలో మాఫీ చేస్తానని చెప్పిండు. కానీ ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు ఉండాలని ఏదేదో అంటున్నరు. నాకు మాత్రం రుణమాఫీ కాలేదు. ఎందుకు కాలేదో కూడా అర్థమైతలేదు. ఇప్పటికైనా మాఫీ చేయాలని కోరుతున్న.
నాకు 2.5 ఎకరాల భూ మి ఉన్నది.సోయా పంట సాగుకోసం రూ. 55వేల లోన్ తీసుకున్న. కానీ ప్రభుత్వం గురువారం ప్రకటించిన మొదటి జాబితాలో నాకు రుణమాఫీ రాలేదు. తొలి విడుతలో రూ. లక్ష లోపు రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ప్రకారం నా లోన్ మాఫీ కావాలి. కానీ ఎందుకు కాలేదో తెలుస్తలేదు.
నేను రూ.50వేలు పంట రుణం తీసుకున్నా. కానీ నా పేరు జాబితాలో లేదు. ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదని ఆలోచిస్తున్నా. కొందరి పేర్లు మాత్రమే వచ్చాయి. నాకు రాకపోవడంతో చాలా బాధపడ్డాను. రెండో విడుతలో వస్తాయని చెబుతున్నారు. మాఫీ వస్తదో, రాదోనన్న ఆందోళన ఏర్పడింది.
– పంచరెడ్డి నరేశ్, రైతు, నిజామాబాద్ రూరల్
ఆర్మూర్ టౌన్, జూలై 18: నేను 2018లో ఎస్బీఐ ఆర్మూర్ బ్రాంచ్‌లో రూ.లక్ష పంట రుణం తీసుకున్నా. అందరితోపాటు నాకు కూడా రుణమాఫీ అవుతుందని అనుకున్నాను. కానీ మాఫీ రాలేదు. సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. ఒకేసారి రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు మాట మార్చారు. అందరిలాగే నాకూ రుణమాఫీ చేయాలి.
– బద్దం నాగరాజ్, మగ్గిడి, ఆర్మూర్ మండలం