పోతంగల్ ఏప్రిల్ 29: ఎలాంటి ఆంక్షలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల కేంద్రంలోని సాయిబాబా ఫంక్షన్ హల్లో మంగళవారం నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హాజరయ్యారు. భూభారతి చట్టాలపై ప్రజలకు రైతులకు క్లుప్తంగా వివరించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన కోటగిరి మండలానికి చెందిన రైతులు ధాన్యం కొనుగోలులో ఎకరానికి 80 బస్తాలు మాత్రమే తీసుకోవడం సరికాదన్నారు.
ఎలాంటి ఆంక్షలు లేకుండా పూర్తిగా ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. మండలంలోని చైతన్య నగర్ గ్రామానికి చెందిన కొంతమంది రైతులు గతంలో వ్యవసాయ భూములు లేని రైతులను గుర్తించి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి 17 గుంటల భూమిని అందజేశారన్నారు. అయితే రైతు బంధు, రైతు బీమా, భూమి పై రుణాలు వంటివి ప్రభుత్వ పథకాలునోచుకోలేక పోతున్నమని, కావున పట్టాలు అందజేయాలని కోరారు. సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, తహసీల్దార్ గంగాధర్, ఇన్చార్జి ఎంపీడీవో చందర్, అగ్రికల్చర్ ఆఫీసర్లు నిషిత, రాజు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.