బీబీపేట్(దోమకొండ), మార్చి 11: ఎన్నో ఆశలతో సాగుచేసిన పంటలు చేతికందే దశలో ఎండిపోతున్నాయి. సాగునీరందక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరి పంటకు నీటి తడులు అందక ఆగమాగమవుతున్నారు. కండ్ల ముందే ఎండుతున్న పంటలు కంటనీరు తెప్పిస్తున్నాయి. వేసవికి ముందే ఎండలు తీవ్రం కావడంతో భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. యాసంగి సాగులో చివరి తడులకు నీళ్లందక ఎండిపోవడం చూశామని, కానీ పంట పొట్టదశలోనే నీరందక ఎండిపోవడం ఇదే మొదటిసారని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎండిపోతున్న పంటను కాపాడుకోలేక రైతులు నానా పాట్లు పడుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో మండుతున్న ఎండలకు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. బోర్లపై ఆధారపడి పంటలను సాగుచేస్తున్న రైతులు నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. బోర్లు ఎత్తిపోవడంతో మడులు వదిలేసి ఆశలు వదులుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంతోపాటు అంచనూర్, సంగమేశ్వర్, లింగుపల్లి, గొట్టిముక్కల, అంబారీపేట, సీతారాంపల్లి తదితర గ్రామాల్లో వరి పంటకు నీటి తడులు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. మండుతున్న ఎండలకు భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టడంతో బోర్లు సరిగ్గా పోయడంలేదు. పంటలను కాపాడుకోవడానికి మరో బోరు తవ్వించినా చుక్కనీరు రాకపోవడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పెట్టుబడి ఖర్చు తడిసి మోపెడై అప్పుల పాలవుతున్నామని వాపోతున్నారు. మరోవైపు రాత్రివేళలో విద్యుత్ సరఫరా చేస్తుండడంతో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు రైతులు చెబుతున్నారు. కొన్ని గ్రామా ల్లో పంటలకు నీరు అందకపోవడంతో ఆశలు వదులుకున్న రైతులు, పంట పొలాల్లో గేదెలను మేపుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
కౌలు రైతు కన్నీటిగోస
రామారెడ్డి (సదాశివనగర్), మార్చి 11: సదాశివనగర్ మండలం భూం పల్లి గ్రామానికి చెందిన మొగ్గం రమేశ్ అనే రైతు మూడున్నర ఎకరాలను కౌలుకు తీసుకొని వరి పంట వేశాడు. పం ట పొట్ట దశలో ఉండగా బోరు ఎత్తిపోయింది. చుక్కనీరు రాకపోవడంతో ఇటీవల కొత్త బోరు వేయించాడు. అది కూడా ఫెయి ల్ అవడంతో పంటంతా ఎండిపోయి, పొలం నెర్రెలు బారింది. ఏం చేయాలో తెలియక ఆందోళన వ్యక్తంచేస్తున్నాడు.
పొట్టదశలోనే నీరందక..
ధర్పల్లి, మార్చి 11: మండలకేంద్రంలోని మోతె వెంకటి అనే రైతుకు చెందిన పొలం సాగునీరందక ఎండిపోయింది. వేసిన పంటలను కొందరు అలాగే వదిలేయగా.. మరికొందరు రైతులు సగం పంటలనైనా కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు.
ఎండిన పంటలను పరిశీలించిన కలెక్టర్
ధర్పల్లి/ సిరికొండ, మార్చి 11 : ధర్పల్లి, సిరికొండ మండలాల్లో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు మంగళవారం పర్యటించారు. ధర్పల్లి మండల కేంద్రంలోని ఇందల్వాయి రోడ్డు, దుబ్బాక రోడ్డుతోపాటు సిరికొండ మండలంలోని పెద్దవాల్గోట్ గ్రామంలో ఎండిపోయిన పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. బోర్ల కింద, ఆయకట్టు కింద సాగువుతున్న పంటల వివరాలతోపాటు పంట పొలాలు ఎండిపోవడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఆరుతడి పంటలు వేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. పలువురు రైతులు తమ గోడును కలెక్టర్‌తో వెల్లబోసుకున్నారు. సిరికొండ మండలంలో సుమారు 300 ఎకరాలు ఎండిపోయాయని ఏవో నర్సయ్య తెలిపారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయాధికారి వాజిద్ హుస్సేన్, ఏడీఏ వీరస్వామి, తహసీల్దార్లు మాలతి, రవీందర్రావు తదితరులు ఉన్నారు.
పసుపు రైతులను మోసగిస్తే కఠిన చర్యలు
కంఠేశ్వర్, మార్చి 11: పసుపు పంట కొనుగోళ్లలో రైతులను ఎవరైనా మోసాలకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు హెచ్చరించారు. జిల్లా మార్కెట్ యార్డులో పసుపు పంట విక్రయాలపై పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. పసుపు విక్రయాల సందర్భంగా రైతులకు ఏ దశలోనూ నష్టం వాటిల్లకుండా, వారు మోసాలకు గురి కాకుండా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. పసుపు క్రయవిక్రయాలపై పరిశీలన కోసం అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. అదనపు కలెక్టర్ కూడా పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తారని పేర్కొన్నారు.