రామగిరి, మార్చి 14 : ఎలాంటి సంఘటనలకు తావివ్వకుండా పదో తరగతి పరీక్షలు సవ్యంగా నిర్వహించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శనివారం పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని సెయింట్ ఆల్ఫాన్స్, నల్లగొండ మండలం దోమలపల్లి జడ్పీహెచ్ఎస్, మునుగోడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. అన్ని కేంద్రాల్లో విద్యార్థుల హాజరు, గైర్హాజరు వివరాలను సంబంధిత పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లను అడిగి తెలుసుకున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద తాగు నీరు ఏర్పాటు చేయాలని, టాయిలెట్స్ ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.
విద్యార్థులను ప్రధాన గేట్ వద్ద పూర్తి స్థాయిలో తనిఖీ చేసిన తర్వాతే పరీక్ష కేంద్రంలోకి పంపించాలని చెప్పారు. ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాల డిపాజిట్ ను పోలీస్ భద్రతతో డిపాజిట్ చేయాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, పరీక్ష కేంద్రంలోకి ఇతరులెవరూ వెళ్లకుండా చూడాలన్నారు. పరీక్ష కేంద్రాల చుట్టుపక్కల జిరాక్స్ కేంద్రాలు మూసివేసేలా నిర్ధారణ చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ఎక్కడ మాల్ ప్రాక్టీస్ జరగరాదని, పరీక్షల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని కలెక్టర్ పేర్కొన్నారు.

పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దు : కలెక్టర్ బి.చంద్రశేఖర్