శ్రీశైలం, ఆగస్టు 3 : కృష్ణానది పరివాహక ప్రాంతాల నుంచి వస్తున్న వరద జూరాలను దాటుకుంటూ శ్రీశైలం డ్యాంకు భారీగా వచ్చి చేరుతోంది. రోజురోజుకు పెరుగుతున్న వరదనీటి రాకతో రిజార్వాయర్ జలకళను సంతరించుకుంటుంది. సోమవారం జూరాల ప్రాజెక్టు క్రస్ట్‌గేట్ల ద్వారా 1,38,000 క్యూసెక్కుల నీరు విడుదల కాగా, విద్యుదుత్పత్తి ద్వారా 33,184 క్యూసెక్కుల వరద విడుదలైంది.
మొత్తం 1,71,184 క్యూసెక్కుల నీరు విడుదలవ్వగా సోమవారం సాయంత్రానికి శ్రీశైలం రిజర్వాయర్‌కు 1,49,917 క్యూసెక్కుల నీరు వచ్చిందని ఇరిగేషన్ అధికారులు పేర్కొన్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులుకాగా ప్రస్తుతం 855.10 అడుగులు, పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలుకాగా ప్రస్తుతం 92.04 టీఎంసీల నీరు ఉన్నట్లు నమోదైంది. కుడి, ఎడమ గట్టు జల విద్యుదుత్పత్తి కేంద్రాల్లో ఎటువంటి ఉత్పత్తి జరగడం లేదు.