హైదరాబాద్,ఆగస్టు 3, (నమస్తే తెలంగాణ): పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. అమెరికాలోని బాల్టిమోర్ వేదికగా పాలమూరు డెవలప్మెంట్ ఫోరమ్(పీడీఎఫ్) ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. విద్య, ఉపాధి, వ్యవసాయ రంగాల్లో వెనుకబాటుతనమే పాలమూరు జిల్లా దుస్థితికి కారణమని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ హయాంలో పాఠశాలల అభివృద్ధి, తాగునీరు, విద్యుత్, మెడికల్ కళాశాలలను సాధించుకున్నామని గుర్తుచేశారు. కర్ణాటక తలపెట్టిన అక్రమ ప్రాజెక్టులను ఆపాలని, లేదంటే రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు కూడా ఎండిపోతాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. 20 ఏండ్ల క్రితమే పాలమూరు డెవలప్మెంట్ ఫోరమ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.
పార్టీలకు అతీతంగా కృషి చేద్దాం
పార్టీలకు అతీతంగా పాలమూరు అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేద్దామని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత పాలమూరు జిల్లా అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని గుర్తుచేశారు. పాలమూరు నుంచి అమెరికాలో స్థిరపడిన 5 వేల మంది ఎన్ఆర్ఐలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి జిల్లా అభివృద్ధికి తగిన ప్రతిపాదనలు ఇవ్వాలని కోరారు.
పాలమూరు బిడ్డగా చిత్తశుద్ధి నిరూపించుకో..
దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ విద్య, సాగునీరు జిల్లా అభివృద్ధికి రెండు కండ్ల లాంటివని, పాలమూరు బిడ్డగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రంగారెడ్డి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి తన బాధ్యతను నెరవేర్చుకోవాలని కోరారు. జిల్లాలో వలసలు పూర్తిగా తగ్గాలని, 36 లక్షల ఎకరాలకు సాగునీరు అందాలని ఆకాంక్షించారు. నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ అమెరికాకు కొత్తగా వచ్చే విద్యార్థులకు ఫోరం తగిన సాయం అందించాలని కోరారు. పాలమూరు జిల్లా ఎన్ఆర్ఐ సమావేశాలు ఎప్పుడు నిర్వహించినా తమ పార్టీ తరఫున హాజరవుతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పాలమూరు డెవలప్మెంట్ ఫోరమ్ అధ్యక్షుడు రామచంద్రారెడ్డిని ఘనంగా సన్మానించారు.