హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): మూడేండ్ల క్రితం 2023లో జరిగిన ఎస్సెస్సీ ప్రశ్నపత్రం లీకేజ్ కేసులో కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్‌కుమార్‌పై ఏ1 నిందితునిగా నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తుదితీర్పు కాపీ హైకోర్టు వెబ్సైట్లో లేకపోవడం విస్మయం కలిగిస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ అంశంపై ఆయన అనేక ఆనుమానాలు వ్యక్తం చేశారు. 2025 నవంబర్ 20న తెలంగాణ హైకోర్టు దాదాపు 304 తుది తీర్పులను వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. కాగా ప్రధాన నిందితుడిగా ఉన్న బండి సంజయ్‌కి సంబంధించిన క్వాషింగ్ ఆర్డర్ మాత్రం అందులో లేకపోవడం పలువురిలో విస్మయం కలిగిస్తున్నదని ఆయన పేరొన్నారు. ఇది యాదృచ్ఛికమా లేక కావాలని చేశారా అని ప్రశ్నించారు. న్యాయవ్యవస్థ గౌరవాన్ని, ప్రతిష్టను కాపాడాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. ఈ అంశంపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని, పొరపాటు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు లేఖ రాయనున్నట్టు తెలిపారు.
ప్రభుత్వ తీరుపై అనేక అనుమానాలు
లక్షల మంది విద్యార్థుల జీవితాలను దెబ్బతీసిన ఈ సంచలన కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఏ విధమైన వాదనలు వినిపించారు? ఈ తీర్పుపై ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అప్పీల్‌కు వెళ్లడం లేదు? అని ప్రజలకు తెలుసుకునే హకు ఉందని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం ప్రజాప్రతినిధుల పేర్లున్న తీర్పులను వెబ్సైట్లో అప్లోడ్ చేయకుండా ఉండేందుకు ఎటువంటి మినహాయింపులు లేవని స్పష్టంచేశారు. ఒకవేళ ఉంటే దీనిపై ప్రత్యేకంగా హైకోర్టు రిజిస్ట్రీ వెంటనే నిజానిజాలను పేరొంటూ ప్రెస్‌నోట్ విడుదల చేయాలని కోరారు.