Ustaad bhagat singh | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఉగాది సందర్భంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా మరో కీలక అప్డేట్ వచ్చింది. ఈ రోజు సాయంత్రం 6.30ని.లకి చిత్ర ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అలానే చిత్ర బృందం గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి అధికారిక ప్రకటన చేసింది. ఈ వేడుకను మార్చి 15న సాయంత్రం 6:30 గంటలకు హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఇప్పటికే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్ అంటేనే అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటీవల జరిగిన OG సినిమా ఈవెంట్ తర్వాత పవన్ అభిమానులకు మరో పెద్ద వేడుకగా ఈ కార్యక్రమం ఉండనుంది. అందుకే ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే టీజర్, పోస్టర్లు అభిమానుల్లో మంచి స్పందనను తెచ్చుకున్నాయి. ఇక ట్రైలర్ విడుదలతో సినిమా పై ఉన్న అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ చిత్రానికి సంగీతాన్ని దేవి శ్రీ ప్రసాద్ అందిస్తుండగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను థమన్ అందిస్తున్నారు. ఈ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్ల కలయిక సినిమాకు ప్రత్యేక హైలైట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. పవన్ కళ్యాణ్ మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా యాక్షన్, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ కలగలిపిన కథతో ఈ సినిమా తెరకెక్కినట్లు సమాచారం. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఉగాది కానుకగా విడుదల అవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.