సిటీబ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): నగరంలో ఆది, సోమవారం జరిగే బోనాల పండుగ ఉత్సవాలను పురస్కరించుకుని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. పాతబస్తీ సింహవాహిని మహంకాళి లాల్‌దర్వాజా బోనాల ఉత్సవాలు, ఊరేగింపు సందర్భంగా ఆదివారం ఉదయం ఆరుగంటల నుంచి ఊరేగింపు ముగిసే వరకు తిరిగి సోమవారం ఉదయం 9గంటల నుంచి ఊరేగింపు ముగిసే వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందన్నారు.
అలాగే దర్బార్ మైసమ్మ బోనాల ఉత్సవాలు, ఏనుగు ఊరేగింపు సందర్భంగా శనివారం రాత్రి తొమ్మిది గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని చెప్పారు. మహంకాళి ఆలయం అంబర్ పేట వద్ద ఆదివారం ఉదయం ఆరుగంటల నుంచి సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు, కట్టమైసమ్మ పోచమ్మ ఆలయం చిలకలగూడ వద్ద ఆది, సోమవారాల్లో ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి 11గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీసులు తెలిపారు. ప్రజలు ఈ రెండురోజులు తమ ప్రయాణాన్ని ముందస్తు ప్రణాళికతో పూర్తి చేసుకోవాలని, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ కోరారు.