నాగర్‌కర్నూల్, ఆగస్టు 8 : రైతుల పంట పొలాలకు నీళ్లు అందించే విషయంలో బీఆర్ఎస్ హెచ్చరికలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేక పంటల సాగుకు ఇబ్బందులు పడుతున్నా ప్రభు త్వం ఏ మాత్రం పట్టనట్టుగా వ్యవహరించింది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని సైతం ఒడిసి పట్టుకునే విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. రైతుల ఇబ్బందులు, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని బీఆర్ఎస్ నాయకులు ఎప్పటికప్పుడు ఎండగడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే మూడ్రోజులుగా ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనాలతోపాటు ప్రాజెక్టులకు నీళ్లు ఎత్తిపోయని పక్షంలో కేటీఆర్ సారథ్యంలో లక్షమంది రైతులతో పాలమూరు ప్రాజెక్టుల వద్దకు వస్తామని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, ప్రాజెక్టుల వద్దే దీక్ష చేస్తామని మరో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరికలు జారీ చేశారు. రైతులతో కలిసి సాగునీటి కోసం ఉద్యమిస్తామని, ప్రాజెక్టులను ముట్టడించడంతోపాటు ఆందోళనలు చేపడుతామని నేతలు చేసిన హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం దిగొచ్చింది.
ఎట్టకేలకు మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగమైన ఎల్లూరు ఎత్తిపోతల వద్ద మూడు, జొన్నలబొగుడ ఎత్తిపోతల వద్ద రెండు, గుడిపల్లి ఎత్తిపోతల వద్ద మూడు మోటర్లను ప్రారంభించి నీటిని రిజర్వాయర్లకు ఎత్తిపోస్తున్నారు. ఎంజీకేఎల్‌ఐలో లిఫ్ట్-3లో (గుడిపల్లి వద్ద) మూడు మోటర్లను ప్రారంభించి నీటిని ఎత్తిపోస్తున్నారు. గురువారం రాత్రి రెండు మోటర్లు, శుక్రవారం సాయంత్రం నుంచి మరో మోటర్ ప్రారంభించి నీటిని రిజర్వాయర్‌లోకి వదులుతున్నారు. ఇప్పటివరకు మూడు మోటర్ల ద్వారా 1,250 క్యూసెక్కులు రిజర్వాయర్‌లోకి వదులుతున్నట్టు అధికారుల లెక్కలు చెప్తున్నాయి. మరో రెండ్రోజులు ఇదే విధంగా మోటర్లను నడిపిస్తే రిజర్వాయర్‌లోకి పూర్తిస్థాయి నీరు చేరుకునే అవకాశం ఉన్నదని ఆయకట్టు రైతులు పేర్కొంటున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో ఆలస్యంగానైనా రిజర్వాయర్‌ను నింపి తమకు సాగునీటిని అందించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన ప్రతిపక్ష నేతలకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.