ఒక విద్యాసంవత్సరాన్ని నా తప్పేమీ లేకుండానే పోగొట్టుకున్నాక మళ్లీ అకడమిక్ ఇయర్ కోసం ఎంతగానో ఎదురు చూశాను. ఆ లోగా సబ్జెక్ట్ మర్చిపోకూడదని చదివిన పుస్తకాలే మళ్లీ మళ్లీ చదువుతూ వచ్చాను. మెడికల్ ఎంట్రన్స్ కోసం ప్రకటన వచ్చిందని ఇంద్రాణి చెప్పింది. మాకు న్యూస్ పేపర్ కూడా వచ్చేది కాదు గనుక ఏ విషయమూ తెలిసేది కాదు.
ఇంద్రాణి అప్పుడు తాను ఇంటర్ చదివిన పింగలి మహిళా కాలేజీలోనే డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నది. కాలేజీకి దగ్గర్లోనే ఇల్లు తీసుకుని వాళ్లన్నయ్యతోబాటు ఉంటూండేది. నేను తనను తీసుకుని కాకతీయ మెడికల్ కాలేజీకి వెళ్లాను. ఎంత పెద్దదో ఆ కాలేజీ! విశాలమైన ఆవరణ, పెద్ద రోడ్డుకు రెండువైపులా చెట్లు, వాటి వెనక చిన్న రోడ్లకు అటూ, ఇటూ స్టాఫ్ క్వార్టర్లు వున్నాయి. ‘అబ్బ! ఈ కాలేజీలో చదివేవాళ్లు ఎంత అదృష్టవంతులో!’ అనుకున్నాను. అప్లికేషన్ తీసుకుని ఫీజు వివరాలు, ఐప్లె చేసే విధానం తెలుసుకున్నాను. ఒకవేళ మెడికల్ సీట్ రాకపోతే బీఎస్సీ చేయాలి కదా! మరి ఆర్ట్స్ కాలేజీలో గానీ, మా కాలేజీలోగానీ చేరతావా? అప్లికేషన్స్ ఇద్దామా? అడిగింది ఇంద్రాణి.
నేనెందుకో బీఎస్సీ అనే మాటే తలపెట్టలేదు. మనం ఇలా ఎంట్రన్స్ రాయగానే అలా వాళ్లే పిలిచి స్వాగతం చెప్పి సీటు ఇస్తారని ఓ పిచ్చి నమ్మకం. నేనెప్పుడూ బాగానే చదువుతాను కాబట్టి, నాకు సీటెందుకు రాదని ఓవర్ కాన్ఫిడెన్స్. పైగా ఎంట్రన్స్ అంటే అన్ని పరీక్షల్లాగే అదీ ఒకటి అనుకోవడమే తప్ప మొత్తం రాష్ట్ర స్థాయిలో ఎన్ని సీట్లుంటాయో, వాటి కోసం ఎంతమంది పోటీ పడతారో, రిజర్వేషన్లు పోగా ఎన్ని ఓపెన్ సీట్లుంటాయో, ఏ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలో తెలియని గుడ్డెద్దు చేన్లో పడ్డ పరిస్థితి.
ఎటూ ఇంద్రాణి చెప్పిందని రెండు కాలేజీల్లో బీఎస్సీకి కూడా ఐప్లె చేసి ఆ సాయంత్రమే బస్సెక్కి మా ఊరికి వచ్చేశాను. ఆ రోజే అమ్మానాన్నలతో విషయమంతా చెప్పాను. అయితే, ఆ మర్నాడు అమ్మా, నాన్నా మాట్లాడుకున్న మాటలు విన్నాక నాకు పరిస్థితి పూర్తిగా అర్థమయింది. అమ్మా, నాన్నా విడిగా మాట్లాడుకోవడమే అరుదు. ‘చిన్నది మళ్ల కాలేజీల చేరుతానంటున్నది!’ అమ్మ గొంతు. ‘ఆఁ నిన్న పోయొచ్చె గద!’.
పోయి రాంగనె అయిపోతదా! ఫీజులు, పుస్తకాలు, బట్టలు.. ఎన్ని ఖర్చులుంటయి?
మరి నువ్వే గద అంటవు, మంచిగ చదివియ్యాల్నని!
అవును, నేనే అంట. అక్కడుండి అట్లనే మంచిగై కొసెళ్లితె బాగుండు. ఇప్పుడిగ హైద్రాబాదుల మళ్ల వాండ్లనే ఉంచుకొమ్మని అడుగలేము. ఇగ హన్మకొండల పెద్దపిల్లను వాళ్లింటికే ఇచ్చుకుంటు అక్కడ్నే చిన్నపిల్లను ఉంచుకొమ్మని ఎట్ల అడుగుతం? హాస్టల్ల వుంచుదామా?
ఒద్దొద్దు, హాస్టల్ల ఎందుకు? అయినా మన దగ్గర ఇప్పుడు గన్ని పైసలు ఎళ్లవు. షరీఖు అయ్యేవరకు చూతాం తియ్యి. ఎక్కడన్న దొరింపు కాకపోతయా! ఎవరింట్లనన్న అడిగి ఉంచుదాం.
అంటరు గానీ, మీరెవర్ని అడుగుతరు నోరు తెరిచి! హైద్రాబాదంటే మా ఓండ్లను నేనే అడిగితి. దానికి పైన చదువాల్నని బాగ ఉన్నది.
ఉంటె ఎట్లనన్న చేసి చదివిద్దాం గానీ, ఎవరింట్ల ఉంచుతం?
హాస్టల్ల ఉంచితె మటుకు మన చుట్టాలు మన బూరు పీకుతరు. ఇదువరుకే మనం ఇద్దరు పిల్లలను చెరో దిక్కు చుట్టాల ఇండ్లల్ల ఉంచితె ‘ఆడిపిల్లలకు చదువులెందుకు? గంతంత ఖర్చులు పెట్టుడెందుకు? ఇగ చదువుకున్నాంక వాండ్లు మన మాట ఇంటరా? పిచ్చి వేషాలేస్తరు, లవ్వులు గివ్వులంటరు’ అని ఎన్నో మాటలన్నరు. హాస్టల్ల ఉంచలేం. అయినా బోలెడు ఖర్చు. ఇప్పట్నుంచి ఎందుకు తియ్యి, అప్పటివరకు చూద్దాం
అది సరె గానీ, వియ్యంకుడు ఉత్తరం రాసిన్రేమో, ఏం మతలబు?
ఏమి లేదు, ‘పెండ్లి మీ వీలు చూసుకునే చెయ్యండి గాని, కట్నం పైసలు ఎట్లనన్న జేసి మొదలే ఇస్తే , మా బిడ్డ పెండ్లి కట్నం కింద అటు ఇచ్చుకుంటం, ఏమనుకోవద్దు’ అని రాసిన్రు.
అయ్యో! మరెట్ల?
ఏమున్నది? కట్నం పైసలు అంటే ఉత్తగ అయితదా? గా చెరువు కింది పొలం బేరం పెడుదామానుకుంటున్న
అయ్యో, అది మంచి పొలమా?
అవును, మంచిదే! మంచిది కానిది అమ్మితె పైసలు రావు. భూమి ఎప్పుడు మంచిదే!
అంతటితో సంభాషణ ఆగిపోయింది. నాకు మనసంతా చెప్పరాని దిగులు నిండుకుంది.
ఆ తరువాత రెండు మూడు రోజులకు నాన్న ఒక బర్రెను అమ్మేశాడు. మాకు ఎప్పుడూ కనీసం మూడు బర్రెలుండేవి. అందులో రెండు తప్పకుండా పాలిచ్చేవి. పొద్దున్నే ఎవరో వచ్చి దుడ్డెతో సహా బర్రెను కొట్టుకుపోతుంటే చాలా బాధ కలిగింది. నాన్న కళ్ల నిండా నీళ్లు! ఆయనకు పశువులంటే ప్రాణం.
అయ్యో! పాలిచ్చే బర్రెను గట్ల అమ్మిన్రేందండి? అంటూ అమ్మ అడిగింది.
పాలిచ్చే బర్రె కాకుంటే పైసలు పెట్టి ఎవడు కొంటడు? నాన్న జవాబు.
తరువాత తెలిసిందేమిటంటే కిరాణా షాపులో అప్పు చాలా అయిందని, షాపాయన రెండు మూడు సార్లు ఇంటికి బాకీ వసూలు కోసం గుమాస్తాను పంపించాడట. నిజానికి నాన్నను అన్ని సార్లు అడగకుండానే ఇచ్చేస్తాడని ఎవరూ అడిగేవారు కారు. అలా జరిగేసరికి నాన్నకు నామోషీగా అనిపించి పాలిచ్చే బర్రెను అమ్మి బాకీ కట్టేశాడు. ఆ బాధతో నాన్న రెండు రోజులు అన్నం కూడా సరిగా తినలేదు. దానికి తోడు ఆ ఏడు వర్షాలు సరిగా పడక పంట రాలేదు. విత్తనాలకు, ఎరువులకు అప్పు చేసి పెట్టుబడి పెడితే తిండి గింజలు కూడా రాలేదు. ఆ అప్పు తీర్చడానికి , జీతగాళ్ల కోసం డబ్బు ఎట్లా తేవాలా అని నాన్న మథనపడే విషయం కూడా ఇంట్లో చెప్పేవాడు కాదు. ‘ఒచ్చే సారి పంట మొత్తం వాళ్లకే ఇస్తం గాని, ఎక్కువ వడ్డీకైనా ఏమన్న అప్పు దొరుకుతదేమో కనుక్కోమని నాన్న ఓసారి ఎవరో ఆసామితో అంటూ ఉంటే విన్నాను. పైసా పైసాకు ఇంత ఇబ్బంది పడుతూ, మరోపక్క అక్క పెళ్లి చేయాల్సిన బాధ్యత వుండగా, నా చదువుకు కావాల్సినంత డబ్బు నాన్న మాత్రం ఎక్కడి నుండి, ఎలా తెస్తాడనే అంతర్మథనం నాలో మొదలైంది.
నెల్లుట్ల రమాదేవి
రచయిత్రి