Saina Nehwal : భారత మాజీ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ (Saina Nehwal) బ్యాడ్మింటన్ స్కోరింగ్‌లో మార్పులను తీవ్రంగా ఖండించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమఖ్య(WBF) ప్రతిపాదిస్తున్న 15 పాయింట్ల ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని ఆమె హితవు పలికింది. ప్రస్తుతం అనుసరిస్తున్న 21 పాయింట్ల విధానమే ఆటకు మేలని.. ఇదే స్కోరింగ్‌ను ఇకపైనా కొనసాగించాలని సైనా కోరింది.
బ్యాడ్మింటన్ ఆటలో మార్పులకు శ్రీకారం చుట్టాలనుకున్న ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య తీరుపై విమర్శలు వస్తున్నాయి. డెన్మార్క్‌లోని హొర్సెన్స్‌లో ఏప్రిల్ 25న జరుగబోయే బీడబ్ల్యూఎఫ్ వార్షిక సమావేశంలో 3×15 పాయింట్ల స్కోరింగ్ ఓటింగ్‌కు సిద్ధమవుతున్న వేళ పాత విధానమే బాగుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈమధ్యే అంతర్జాతీయ మూమెంట్స్ టు యునైటెడ్ నేషన్స్‌లో భారత సలహాదారుగా నియమితులైన భారత మాజీ షట్లర్ సైనా నెహ్వాల్ సైతం ఇదే మాట అంటోంది. సెట్ పాయింట్లను 21 నుంచి 15కు తగ్గించడం సరికాదని ఆమె చెబుతోంది.
Saina Nehwal strongly opposes proposed 15-point system for badmintonhttps://t.co/smJJ5c1h8g
— India Today Sports (@ITGDsports) March 14, 2026
‘బ్యాడ్మింట్ ఆటకు ఘనమైన చరిత్ర ఉంది. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్, బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ వంటివి ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఈ టోర్నీల్లో తీమ్రమైన పోటీతో పాటు ఓర్పును ప్రదర్శించాల్సి ఉంటుంది. కాబట్టి.. స్కోరింగ్‌లో ఏ విధమైన మార్పులు చేయాలనుకున్నా సరే జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రస్తుతం అమలులో ఉన్న 21 పాయింట్ల విధానం ఎంతో బాగుంది. గత కొన్నేళ్లుగా ఆటగాళ్లందరూ ఈ స్కోరింగ్‌కే ఆలవాటు పడ్డారు. ఒకవేళ స్కోరింగ్‌లో మార్పులు చేస్తే.. ర్యాలీలు ఆడడంపై, పోటీతత్వంలో సమతుల్యం కూడా దెబ్బతింటుంది. ఏదిఏమైనా.. ప్లేయర్ల దృష్టంతా పోటీల మీదే ఉండాలి.. ఆట స్ఫూర్తిని కొనసాగించేలా ఉండాలి’ అని వెల్లడించిన సైనా క్రీడాకారులు సంక్షేమంపై దృష్టి సారించాలని బీడబ్ల్యూఎఫ్‌ను కోరింది.