నిజామాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ; ఎన్నికలకు ముందు వరాలు కురిపించిన కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కాక హామీల ఎగవేతలకు తెర లేపింది. సగం మందికే రుణమాఫీ చేసి, మిగతా వారికి ‘చేయి’చ్చిన రేవంత్ సర్కారు.. ఇప్పుడు రైతుభరోసాను ఎగ్గొట్టింది. వానకాలానికి సంబంధించిన పెట్టుబడి సాయం ఇవ్వట్లేదని శనివారం విస్పష్టంగా చెప్పింది. ప్రభుత్వ ప్రకటనపై కన్నెర్ర చేసిన ఉమ్మడి జిల్లా కర్షకులు.. సర్కారు దిష్టిబొమ్మలను దహనం చేశారు. నమ్మి ఓటేస్తే నట్టేటా ముంచిన కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెబుతామని రైతులు స్పష్టం చేస్తున్నారు.
రైతులను, ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. అధికారం కోసం అనేక హామీలు గుప్పించిన హస్తం పార్టీ.. గద్దెనెక్కాక వాటికి మంగళం పాడింది. రైతులందరికీ రూ.2 లక్షల లోపు పంట రుణాలను మాఫీ చేస్తామని చెప్పి, సగం మందికి కూడా చేయకుండా చేతులెత్తేసింది. ఇక, రైతుబంధు కింద కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన రూ.10 వేల సాయాన్ని రూ.15 వేలకు పెంచుతామన్న కాంగ్రెస్ దాన్ని కూడా ఎగ్గొట్టేసింది. వానకాలానికి సంబంధించి రైతుభరోసా లేనట్లేనని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు శనివారం ప్రకటించారు. కెబినేట్ సబ్ కమిటీ నివేదిక వస్తే యాసంగికి సంబంధించి రైతుభరోసా సంగతి చూస్తామని చెప్పారు. మంత్రి మాటలను బట్టి పెట్టుబడి సాయం పథకాన్ని శాశ్వతంగా ఎత్తేసే ప్రయత్నం కొనసాగుతున్నదని రైతాంగంలో చర్చ మొదలైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక యాసంగికి సంబంధించి పెట్టుబడి సాయాన్ని మొక్కుబడిగా కానిచ్చేశారు. ఆ తర్వాత వానకాలానికి సంబంధించి రైతుభరోసా డబ్బులను ఇవ్వలేదు. ఇదిగో, అదిగో అంటూ సీజన్‌ను ముగించేసిన సర్కారు.. ఇక ఇవ్వబోమని తేల్చి చెప్పేసింది. ఇప్పుడేమో రైతుభరోసా ఇచ్చేది కష్టమే అన్నట్లు మంత్రి తుమ్మల వ్యాఖ్యానించడంపై రైతాంగం భగ్గుమంటున్నది.
వాస్తవానికి రైతులకు తొలి నుంచి కేసీఆర్ అండగా నిలబడ్డారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులను.. పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేసి రుణ విముక్తుల్ని చేశారు. అలాగే, పంట పెట్టుబడి కోసం అప్పులు చేస్తున్నారని తెలిసి రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. సీజన్ ఆరంభానికి ముందే రైతుల ఖాతాల్లో డబ్బులు వేశారు. ప్రతి సీజన్లో ఉమ్మడి జిల్లాలోని 5 లక్షల మందికి పైగా రైతులకు రూ. వె య్యి కోట్లకు పైగా సాయం అందించారు. పల్లెల్లోనే కేంద్రాలు పెట్టి వడ్లను మద్దతు ధరకు కొనిపించారు. నిరంతర విద్యుత్, ఫుల్లుగా సాగునీళ్లతో రైతులకు కష్టా లే లేకుండా పోయాయి. కానీ, కల్లబొల్లి మాటలు చె ప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కర్షకులను మళ్లీ కష్టాల్లోకి నెట్టింది. పది నెలల కాలంలో రైతులకు సాయం చేసిన దాఖలాలే లేవు. ఎకరానికి రూ.15 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామంటూ ఢంకా బజాయించి చెప్పిన నేతలే.. ఇప్పుడు చేతులెత్తేశారు. రుణమాఫీ రాక, పెట్టుబడి సాయం అందక రైతులంతా రోడ్డెక్కుతున్నారు. శనివారం వివిధ మండలాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. మరోవైపు, బీఆర్ఎస్ సైతం రైతుల తరఫున పోరాటానికి సిద్ధమైంది. నేడు (ఆదివారం) అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నది.
మాఫీ లేదు.. సాయమూ లేదు
రైతు డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ అనేక మోసపూరిత వాగ్దానాలు చేసింది. రూ.2 లక్షల రుణమాఫీ, రూ.15 వేల పెట్టుబడి సాయం వంటి హామీలు ఇచ్చింది. కానీ అమలులోకి వచ్చేసరికి మాత్రం రిక్త‘హస్తమే’ చూపెడుతున్నది. డిసెంబర్ 9న రైతులందరికీ రూ.2లక్షల రుణమాఫీ అని ప్రకటించిన రేవంత్ సర్కారు.. అధికారం చేపట్టి పది నెలలైనా అమలు చేయలేదు. మళ్లీ డిసెంబర్ వస్తున్నా పూర్తి స్థాయిలో రుణాలు మాఫీ కాలేదు. కనీసం రైతుభరోసా సాయమైనా అందుతుందని ఎదురు చూసిన రైతాంగానికి సర్కారు షాక్ ఇచ్చింది. జూన్‌లో జమ చేయాల్సిన డబ్బులు సీజన్ ముగిసినా ఇవ్వలేదు. ఇదిగో, అదిగో అని చెప్పి.. ఇప్పుడేమో ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. అన్ని పంటలను మద్దతు ధరకు కొంటామన్న కాంగ్రెస్ ప్రభుత్వం అమలులో విఫలమైంది. ఇక, వడ్లకు రూ.500 బోనస్ అని హామీ ఇచ్చిన రేవంత్ సర్కారు.. సన్నాలకే అని కొర్రీలు పెట్టింది. ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేయలేక చేతులెత్తేసిన హస్తం పార్టీపై మండిపడుతున్న రైతు లు.. కేసీఆర్ సార్ ఉన్నప్పుడే బాగుండే అని గుర్తు చేసుకుంటున్నారు.
మండలాల్లో వెల్లువెత్తిన నిరసనలు
రైతులకు ఇవ్వాల్సిన వర్షాకాల రైతు భరోసా ఇవ్వలేమంటూ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తేల్చిచెప్పడంతో జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. పార్టీ శ్రేణులతోపాటు రైతులు రోడ్లపైకి తరలివచ్చి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లాలోని మోర్తాడ్, కమ్మర్పల్లి, బాల్కొండ, ఆర్మూర్, భీమ్‌గల్, నందిపేట్, వేల్పూర్, ఏర్గట్ల, ముప్కాల్, మెండోరా తదితర మండలాల్లో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధుకు రాంరాం చెబుతారన్న కేసీఆర్ మాటలను.. రేవంత్ రెడ్డి సర్కార్ అక్షరాల నిజం చేసిందన్నారు. గత సీజన్లో రేపుమాపు అంటూ రైతుభరోసా ఇవ్వలేదని, ఈ సీజన్లో కూడా ఇవ్వలేమని మాట్లాడడం రైతులను నమ్మించి మోసం చేయడమేనని మండిపడ్డారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి రైతులు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.