సర్కారును నమ్ముకొని యాసంగి సీజన్లో సన్న వడ్లు పండించిన రైతులకు బోనస్ కష్టాలు తప్పడం లేదు. క్వింటాలుకు రూ.ఐదు వందలు బోనస్ ఇస్తామన్న ప్రభుత్వం ఆ విషయాన్ని మరిచిపోయినట్లున్నది. వడ్లు కాంటా పెట్టి రోజులు గడస్తున్నా.. బోనస్ డబ్బులు మాత్రం ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు. మరోవైపు వానకాలం సీజన్ ప్రారంభం అవుతుండడంతో ప్రభుత్వం ఇస్తామన్న ప్రోత్సాహక డబ్బుల కోసం రైతులు వేయి కండ్లతోఎదురుచూస్తున్నారు.
– నిజామాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
యాసంగి సీజన్లో సన్న వడ్లు పండించిన రైతులకు బోనస్ చెల్లించడంలో సర్కారు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. ఇచ్చిన మాటను అమలు చేసేందుకు కొర్రీలు పెడుతూ.. రైతులను ముప్పు తిప్పలకు గురిచేస్తున్నది. నిర్ణీత గడువులోగా బోనస్ డబ్బులు చెల్లించాల్సి ఉండగా.. రోజులు గడుస్తున్నా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదు. కనీస మద్దతు ధరకు ధాన్యం అమ్ముకున్న రైతులకు చెల్లింపులు కూడా ఆలస్యం అవుతున్నాయి. ఇదేందని ప్రశ్నిస్తే సమాధానం ఇచ్చే వారు లేకుండా పోయారు.
సన్న వడ్లు పండిస్తే క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు అరకొరగానే చెల్లింపులు చేసింది. కొద్ది మందికి మాత్రమే బోనస్ డబ్బులు జమ కాగా మిగిలిన వారికి రావడం లేదు. ధాన్యం విక్రయించిన రెండు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో బోనస్ జమ చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రకటించారు.
నిజామాబాద్‌లో నిర్వహించిన రైతు మహోత్సవంలోనూ ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. బోనస్ డబ్బులు ఆపడం లేదంటూ కుండ బద్ధలు కొట్టారు. కానీ బోనస్ చెల్లింపుల్లో మాత్రం ఎడతెగని నిర్లక్ష్యం తాండవిస్తోంది. ఏ కారణంతో ఇలా జరుగుతున్నదో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. అసలు ప్రభుత్వం బోనస్ ఇస్తుందా? లేదా? అని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు మాటలు నమ్మి సన్నాలు సాగు చేశామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు రూ.449 కోట్ల వరకు బకాయిలు పేరుకు పోయినట్లుగా తెలుస్తోంది.
ధాన్యం కొనుగోళ్లలో జోరు.. బోనస్ చెల్లింపులో బేజారు..
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు భారీగా జరిగాయి. కేసీఆర్ హయాంలో ఏర్పాటైన పద్ధతి ప్రకారమే అధికార యంత్రాంగం ధాన్యాన్ని సేకరించింది. గతం మాదిరిగా ఈసారి నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలిచింది. కామారెడ్డి జిల్లా సైతం టాప్-5లో నిలిచినట్లు అధికారులు చెబుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో క్రమపద్ధతిలో కొనుగోళ్ల ప్రక్రియను ఏర్పాటు చేయడంతోనే ఇదంతా సాధ్యమైంది.
కల్లబొల్లి హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను అడుగడుగునా మోసం చేస్తున్నది. ఇందులో బోనస్ చెల్లింపు ప్రధానమైనది. సన్నాలకు క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తామని ఘనంగా చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి మాటలకు చేతలకు పొంతనే ఉండడం లేదు. నిజామాబాద్ జిల్లాలో యాసంగిలో 7లక్షల 15వేల మెట్రిక్ టన్నులు సన్న రకం ధాన్యాన్ని సేకరించారు. వీటికి మొత్తం రూ.360కోట్లు మేర బోనస్ రైతులకు చెల్లించాల్సి ఉన్నది. కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకూ లక్షా 77వేల మెట్రిక్ టన్నుల సన్నాలను యంత్రాంగం కొనుగోలు చేయగా.. బోనస్ రూ.89కోట్లు చెల్లించాల్సి ఉంది. కాగా ప్రభుత్వం ఇందుకోసం నిధులు విడుదల చేయడం లేదు. ఇదేమని ప్రశ్నిస్తే సర్కారు నుంచి సమాధానం రావడం లేదు.
అమాత్యుల మాటలకు అర్థాలే వేరులే..
రైతు మహోత్సవం పేరిట ఎగ్జిబిషన్‌ను ప్రారంభించేందుకు ఏప్రిల్‌లో జిల్లాకు ముగ్గురు మంత్రులు వచ్చారు. ప్రత్యేక హెలికాప్టర్లో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు వచ్చి రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. రైతుభరోసాను ఏప్రిల్ నెలాఖరులోగా అన్నదాత ఖాతాల్లో జమ చేస్తామని వ్యవసాయ మంత్రి చెప్పారు. రైతులోకానికి బహిరంగంగానే క్షమాపణలు కోరారు. పెట్టుబడి సాయాన్ని సరైన సమయంలో వేయలేకపోయామంటూ ఒప్పుకున్నారు.
సీన్ కట్ చేస్తే వ్యవసాయ మంత్రి మాటలకు నెల రోజులు గడిచినా రైతు భరోసా సగానికి ఎక్కువ మంది రైతులకు జమ కాలేదు. మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం ఘనంగా మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చూస్తామంటూ చెప్పుకొచ్చారు. సన్నాలకు రూ.500 చొప్పున చెల్లిస్తామని త్వరగా రైతుల ఖాతాల్లోనే బోనస్ వేస్తామంటూ చెప్పుకొచ్చారు. సీన్ కట్ చేస్తే మంత్రి మాటలన్నీ నీటి మూటలయ్యాయి. ఉమ్మడి జిల్లాలో బోనస్ చెల్లింపులు సరిగా కాకపోవడం తో వందల కోట్ల రూపాయలకు బకాయిలు చేరుకోవడం విడ్డూరంగా మారింది.