నిజామాబాద్, జూన్ 19, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ; రైతుభరోసా నిధుల విడుదలపై కాంగ్రెస్ ప్రభుత్వం లీకులు ఇచ్చింది. తమ అనుకూల మీడియాలో రైతులను ఆగం పట్టించేందుకు భారీ ఎత్తున ప్రచారం చేస్తోంది. జూన్ 30న పెట్టుబడి సాయం ఇస్తామంటూ రేవంత్ రెడ్డి సర్కారు చెప్పినట్లుగా ప్రచారం హోరెత్తిస్తున్నారు. యాసంగిలో అందరికీ మొత్తం భూములకు పెట్టుబడి సాయం అందిస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సీన్ కట్ చేస్తే వరి కోతకు వచ్చే సమయానికి కంటి తుడుపు చర్యగా 2 ఎకరాలకే నగదు జమ చేసి చేతులు దులుపుకున్నారు. వానాకాలం సీజన్ మొదలైంది. పుటం మడులు పోసుకుని రైతులు సాగుకు సిద్ధం అవుతున్నారు. రైతుభరోసా సాయం ఇవ్వాలని కర్షకులు కోరుతున్నారు. నెలాఖరులో ఎకరానికి రూ.6వేలు చొప్పున రైతుభరోసా నిధులు జమ చేస్తామని చెబుతున్నప్పటికీ రైతుల్లో నమ్మకం కలగడం లేదు. రైతుల విశ్వాసం సంపూర్ణంగా కోల్పోయిన రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పెట్టుబడి సాయం ఈసారి అందరికీ ఇస్తారా? లేదంటే నమ్మించి నట్టేట ముంచుతారా? అన్నది తేలడం లేదు. లీకులు ఇచ్చినట్లుగానే జూన్ 30న రైతుభరోసా నిధులు విడుదల చేస్తే ఒకేసారి మొత్తం సాగు భూములకు మంజూరు చేస్తారా? ఎకరానికే పరిమితం అవుతారా? అన్నది తెలియక రైతులు గందరగోళంలో మునిగి తేలుతున్నారు.
రేవంత్ సర్కార్‌పై రైతుల ఆగ్రహం..
అధికారిక కార్యక్రమాల్లో, కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్స్‌లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలంతా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. రైతులకు తమ పాలనలో భారీ ఎత్తున సాయం చేస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలో పైసా లాభం చేయకపోయినప్పటికీ అబద్ధాలు వల్లిస్తూ జనాలను అయోమయంలో నెట్టి వేస్తున్నారు. ఠంచనుగా సాగు కాలానికి పెట్టుబడి సాయాన్ని మంజూరు చేయాల్సిన ప్రభుత్వమే నిర్లక్ష్యంగా నీతి తప్పి వ్యవహరిస్తోంది. వాస్తవాలకు దూరంగా ప్రచారం చేసుకుంటూ రైతులను అడుగడుగునా మోసం చేస్తున్నది. రైతుబంధు స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన రైతుభరోసా పథకం అమలు అన్నది ఆది నుంచి అభాసు పాలవుతోంది. ఏటా ఎకరానికి రూ.15వేలు చొప్పున సాగు ఖర్చులకు నగదు సాయం చెల్లిస్తామంటూ హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గద్దెనెక్కిన తర్వాత మాట తప్పి రైతులను నిలువునా ముంచుతోంది. యాసంగిలో అరకొరగా సాయం అందించి రైతులందరికీ సాగు భూములంతటికీ పెట్టుబడి సాయం ఇచ్చినట్లుగా అబద్ధపు ప్రచారంతో కాంగ్రెస్ నాయకులు పబ్బం గడుపుతుండటం విచిత్రంగా మారింది. కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న అబద్ధపు ప్రచారాలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వానాకాలంలో నిజాయతీగా మొత్తం భూములకు పెట్టుబడి సాయం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.
నాట్లకు సిద్ధమైన రైతులు..
వానాకాలం సాగు కాలం మొదలై రెండు వారాలు పూర్తయ్యింది. పుటం మడులు వేసుకుని రైతులంతా సాగుకు నడుం బిగించారు. కొద్ది రోజుల్లోనే నాట్లు కూడా ఆయా ప్రాంతాల్లో షురూ కానున్నాయి. భూగర్భ జలాలు అందుబాటులో ఉన్న వారు, నీటిపారుదల వ్యవస్థ ద్వారా సాగు నీటి లభ్యత కలిగిన వారంతా సాగుకు సంసిద్ధం అవుతున్నారు. ఎప్పటిలాగే బాన్సువాడ, జుక్కల్, బోధన్ నియోజకవర్గాల్లో నిజాంసాగర్ ఆయకట్టు ఏరియాలో వరి నాట్లు మొదలయ్యాయి. మిగిలిన చోట్ల పుటం మడులు చేతికి వచ్చాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, బిహార్ వ్యవసాయ కూలీలు వచ్చేశారు. నాట్లకు వారంతా రెడీ అవుతున్నారు. మన రైతులంతా ఇతర రాష్ర్టాల కూలీలపైనే ఆధారపడుతున్నారు. నాట్లకు స్థానికంగా కూలీలు ఎవ్వరూ దొరకకపోవడంతో ఉత్తరాది వాళ్లే కీలకం అయ్యారు. ఉపాధి హామీ పనులకు స్థానిక జనం వరుస కడుతున్నారు. పొలాల్లో వరి నాట్లకు ససేమిరా అంటున్నారు. మరోవైపు వేగంగా, కచ్చితత్వంతో నాట్లు వేయడంలో నేర్పరిగా పేరొందిన ఉత్తరాది కూలీల పని తనం మెచ్చి చాలా మంది వీళ్లకే నాట్ల బాధ్యతలు అప్పగిస్తున్నారు. నాట్లు వేసే సమయానికి కూలీ డబ్బులు చెల్లించేందుకు రైతుల చెంత డబ్బుల్లేవు. చేతులో చిల్లిగవ్వ లేకపోవడంతో ఆగమాగం అయ్యే దుస్థితి ఏర్పడింది. రైతుభరోసా పథకం ద్వారా పెట్టుబడి సాయం ఠంచనుగా వస్తే బాగుంటుందనే ఆలోచనలో కర్షకులు భావిస్తున్నారు.
ప్రతి సీజన్లోనూ ఎదురు చూపులే…
రైతుభరోసా సాయం కోసం ప్రతి సీజన్లోనూ రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదు. అసలు నగదు సాయం అందుతుందా? లేదా? అన్న సందిగ్ధంలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పంట కాలంలో చేస్తోన్న మోసానికి రైతులు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు ఎకరానికి రూ.15వేలు చొప్పున ఏటా రెండు పంటలకు కాంగ్రెస్ సర్కార్ సాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారంలోకి రాగానే రూ.12వేలు చొప్పున ఏటా ఎకరానికి పెట్టుబడి సాయం చేస్తామని చెప్పడం ద్రోహంతో పోల్చుతున్నారు. రైతులను గోస పెడుతున్న రేవంత్ రెడ్డి సర్కార్ తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఎకరాకు ప్రతి సీజన్లో రూ.7500 చొప్పున సాయం అందించాల్సి ఉంది. కానీ కేవలం రూ.6వేలు మాత్రమే ఇస్తున్నారు. అది కూడా ఒక సీజన్లో ఎగ్గొట్టి మరో సీజన్లో కొంత మందికే నగదు అందించి చేతులు దులుపుకుంటున్నారు.