నిజామాబాద్, జనవరి 30, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ రాష్ర్టాన్ని ప్రాణాలు పణంగా పెట్టి సాధించిన కేసీఆర్… తన పదేళ్ల పాలనలో ఎన్నో విప్లవాత్మక పథకాలు తీసుకు వచ్చారు. కేసీఆర్ దార్శనికత, దూరదృష్టి మూలంగానే నూతన రాష్ర్టాన్ని అనతి కాలంలోనే దేశంలోనే నంబర్ వన్‌గా, రోల్ మౌడల్గా నిలబెట్టింది. సమైక్య పాలనలో బీడుగా మారిన లక్షలాది ఎకరాల భూములకు సాగు నీరు అందించి రైతులకు కొండంత అండగా నిలిచారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో యువతకు ఉద్యోగ, ఉపాధి మార్గాలు చూపించారు. పారిశ్రామిక అభివృద్ధిని పరుగులు తీయించారు.
వ్యవసాయాన్ని గాడిలో పెట్టి సాగును సంబురంగా మార్చారు. అనాథగా మారిన రైతును ఆదుకున్నారు. ఆర్థికాభివృద్ధిని రాకెట్ వేగంతో దూసుకెళ్లే విధంగా పని చేశారు. మౌళిక సదుపాయాలు ప్రతి గ్రామానికి తీసుకెళ్లారు. బీటీ రోడ్ల నిర్మాణాన్ని విస్తృతంగా చేపట్టారు. ఇలా ఒకటి… రెండు కాదు… వందలాది కార్యక్రమాలు, పథకాలతో సంక్షేమాన్ని, అభివృద్ధిని సమానంగా ప్రజల ముంగిటకు తీసుకెళ్లి తెలంగాణను సగర్వంగా నిలబెట్టారు. సంక్షేమ సర్కార్‌గా నిలిచిన కేసీఆర్ పాలనపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు నోటికొచ్చిన దుష్ప్రచారాలతో, అబద్ధాలతో బద్నాం చేయాలని చూశారు.
ప్రజల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి రాజకీయ లబ్ధి పొందారు. కానీ నిజం ఎప్పటికైనా నిర్భయంగా బయట పడుతుంది. అబద్ధాలు ఎప్పటికీ చెల్లుబాటు కావనడానికి పార్లమెంట్ సాక్షిగా గురువారం(జనవరి 29న) పార్లమెంట్‌కు కేంద్ర ప్రభుత్వం సమర్పించిన ఆర్థిక సర్వే వివరాలే నిదర్శనంగా నిలిచింది. పదేళ్ల కేసీఆర్ పరిపాలన ప్రగతిమయంగా సాగిందని, అద్భుతాలు సృష్టించబడ్డాయని ఆర్థిక సర్వే కుండ బద్ధలు కొడుతూ ప్రశంసలతో ముంచెత్తడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కేసీఆర్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా భూ ఉపరితలంపై మూడున్నరేళ్ల కాలంలోనే నిర్మించిన అతి పెద్ద నీటిపారుదల ప్రాజెక్టుగా ఖ్యాతికెక్కింది. రైతుల పాలిట కల్పవల్లిగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీలు అడుగడుగునా బురద రాజకీయం చేశాయి. గుక్కెడు నీళ్లు లేని తెలంగాణకు గోదావరి జలాలను బీడు భూములకు మళ్లించేందుకు చేపట్టిన భారీ క్రతువుపై నిప్పులు పోసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి నిత్యం అసత్యాలు వల్లించాడు.
బీజేపీ ఎంపీలు బండి సంజ య్, ధర్మపురి అర్వింద్, ఇతర శక్తులన్నీ జత కట్టి అదే పనిగా విష ప్రచారం చేశారు. కాంగ్రెస్, బీజేపీలు దొందూ దొందే అన్నట్లుగా ఉమ్మడిగా కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసేందుకు ఆం ధ్రా శక్తులతో చేతులు కలిపి ఇష్టానుసారంగా వ్యవహరించారు. తీరా సీన్ కట్ చేస్తే కేంద్ర ఆర్థిక సర్వే నివేదికలో నిజాలు నిర్భయంగా వెల్లడి అయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్, మల్టీ పర్పస్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మూలంగా సాగు విప్లవం జరిగిందని కేంద్ర సర్కారు కితాబునివ్వడంతో కాంగ్రెస్, బీజేపీల బుద్ధి హీనమైన తీరు తేటతెల్లమైంది.
కేసీఆర్ వ్యతిరేక ముఠాకు కేంద్ర ఆర్థిక సర్వే నివేదికతో గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లుగా మారింది. అబద్ధాలతో రాజకీయాలు నెరిపిన శక్తులకు కేంద్ర సర్కారే పార్లమెంట్ సాక్షిగా నిజాలు ఒప్పుకోవడంతో దుష్ప్రచారం చేసిన నోళ్లు మూత పడాల్సిన దుస్థితి ఏర్పడింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో ప్యాకేజీ- 20, 21, 22 చేపట్టారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకాన్ని పూర్తి చేసి గోదావరి జలాలను ఎదురెక్కించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు అడుగంటిన సందర్భాల్లో వరద కాలువ ద్వారా గోదావరి నీళ్లను నింపి రైతులకు అండగా నిలిచారు. నిజాంసాగర్ ప్రాజెక్టుకు గడ్డు కాలం ఏర్పడిన సందర్భంలో కొండపోచమ్మ సాగర్ నుంచి హల్ది వాగు ద్వారా నీళ్లు తరలించేందుకు ఏర్పాట్లు విజయవంతమైన సందర్భాలు ప్రజల మనుగడలోనే ఉండడం విశేషం.
బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో చేపట్టిన అనేక పథకాల్లో మిషన్ కాకతీయ పథకం అద్భుతమని కేంద్ర ఆర్థిక సర్వే ప్రత్యేకంగా ప్రస్తావించింది. పూడిక తీత ద్వారా బోసిపోయిన చెరువులకు పునరుజ్జీవం కల్పించడం వల్ల భూగర్భ జలాలు అమాంతం పెరిగి సాగు భూములు భారీగా అందుబాటులోకి వచ్చాయని కేంద్ర సర్కారు పేర్కొంది. ఫలితంగానే సాగు విస్తీర్ణం పెరిగి ధాన్యం ఉత్పత్తి భారీగా వచ్చిందని కేంద్ర ప్రభుత్వం నిజాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో మిషన్ కాకతీయ పథకం ద్వారా అనేక తటాకాలు అభివృద్ధికి నోచుకుని నేటికీ మంచి ఫలితాలను అందిస్తోంది. కాలువలు ఆధునికీకరణ, తూముల రిపేర్లు, చెరువుల్లో పూడిక తీత వంటి చర్యలతో వానాకాలంలో నిల్వ అయిన జలాలు యాసంగి పంటలకు నీటి కొరత లేకుండా చేస్తోందంటే కేసీఆర్ గొప్పతనానికి నిదర్శనం. నిజామాబాద్ జిల్లాలో 1200 చెరువులుండగా వీటి పరిధిలో 40వేల ఎకరాలకు మాత్రమే సాగు నీరు అందేది. మిషన్ కాకతీయ తర్వాత 1లక్షా 11వేల ఎకరాల్లో పంటలు సాగవుతుందని అధికారిక లెక్కలే వెల్లడిస్తున్నాయి.
కేసీఆర్ తీసుకు వచ్చిన మిషన్ కాకతీయ పథకంతో అనేక చెరువులకు పునరుజ్జీవం దక్కింది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 1,954 చెరువులు, కుంటలుండగా 97,881 ఎకరాల ఆయకట్టుకు ప్రాణం పోసినట్లు అయ్యింది. ఉమ్మడి జిల్లాలో చెరువుల కింద ఆయకట్టు 60 నుంచి 90శాతానికి ఎగబాకడానికి కేసీఆర్ తీసుకు వచ్చిన చెరువుల పూడిక తీత పథకం మిషన్ కాకతీయనే ప్రధాన కారణం. స్వరాష్ట్రం ఏర్పడటానికి ముందు వరకు భారీ వానలు పడితే ఎక్కడో ఒక చోట చెరువులకు బుంగ పడటం, గండి పడి కొట్టుకపోవడం వంటివి కనిపించేవి. చెరువు కట్టలు బలోపేతం చేయడం ద్వారా చెక్కు చెదరకుండా రూపుదిద్దుకున్నాయి.
ఖలీల్‌వాడి, జనవరి 30: కేసీఆర్ పాలనలో కాళేశ్వరం, మిషన్ కాకతీయ ద్వారా సా గు, తాగునీటి సౌకర్యం కల్పించారు. రివర్స్ పంపింగ్ ద్వారా అన్ని ప్రాజెక్టులకు నీళ్లు తీసుకువచ్చి కరువు లేకుండా చేసిన వ్యక్తి కేసీఆర్. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చేసి తెలంగాణను దేశంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దారు.
-పులి జైపాల్, సీనియర్ న్యాయవాది
ఖలీల్‌వాడి, జనవరి 30: సీఎం కేసీఆర్ ప్రపంచమంతా తెలంగాణ వైపు చూసే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. రైతుబంధు, రైతుబీమా అమలు చేసి అన్నదాతలకు ఆసరాగా నిలిచారు. కేసీఆర్‌ని టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే. తెలంగాణ మొత్తం కేసీఆర్ వెంటే ఉన్నది.
-దాదన్నగారి మధుసూదన్‌రావు,
మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వ వైభవం ఎల్లారెడ్డి, జనవరి 30 : వందేండ్ల క్రితం నిర్మించిన చెరువులకు మిషన్ కాకతీయ పథకంతో పూర్వ వైభవం వచ్చింది. అప్పటి సీఎం కేసీఆర్ ఆలోచనతో రైతులకు మేలు జరిగింది. ప్రతి చెరువులో ఎండాకాలంలో చుక్క నీరు ఉండక పో యేది. ఈ పథకం అమలు తరువాత ఇప్పుడు ఎండా కాలంలోనూ నీరు ఉంటున్నది.
-జలంధర్ రెడ్డి, రైతు నాయకుడు, మత్తమాల
నిజాంసాగర్, జనవరి 30: కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పదేండ్ల కాలంలో సాధించిన అభివృద్ధిని కేంద్ర ఆర్థిక సర్వే రిపోర్టు ప్రశంసించడం అభినందనీయం. కాళేశ్వరం ప్రాజెక్టుతో నిజాంసాగర్‌కు సైతం నీటి మళ్లింపు చేపట్టి పంటలకు సాగు నీటిని అందించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులకు భరోసా కలిగింది. పంట దిగుబడులు పెరిగి రైతులందరూ ఆర్థికంగా బలోపేతమయ్యారు.
-సుభాష్‌గౌడ్, అచ్చంపేట, నిజాంసాగర్
ధర్పల్లి, జనవరి 30: పదేండ్ల కేసీఆర్ పాల న రామరాజ్యాన్ని తలపించింది. రైతుల శ్రేయస్సే ధ్యేయంగా ప్రాజెక్టులు నిర్మించి, రాష్ర్టాన్ని సస్యశ్యామ లం చేశారు. వరి పంటకు దేశంలోనే కేరాఫ్ అడ్రస్‌గా రాష్ర్టా న్ని మలచిన ఘనత కేసీఆర్‌కే దక్కింది. కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు స్ఫూర్తితోనే జాతీయ స్థాయిలో పీఎం మోదీ కిసాన్ సమ్మాన్ యో జన పథకాన్ని ప్రవేశపెట్టాడంటేనే కేసీఆర్ పాల న ఎలా కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు.
-నల్ల సారిక, మాజీ ఎంపీపీ, ధర్పల్లి
నాగిరెడ్డిపేట, జనవరి 30: కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా అభివృద్ధి కనిపించింది. పట్టణాల నుంచి పల్లెల దాకా అన్ని రంగాలు ప్రగతిని సాధించాయి. కేంద్ర ఆర్థికసర్వే చెప్పిన మాటలు అక్షర సత్యాలు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం గణనీయ మైన వృద్ధి సాధించింది.
-సాయిబాబా, వ్యాపార వేత్త, నాగిరెడ్డిపేట
మాక్లూర్, జనవరి 30: కేసీఆర్ పాలనలో చేపట్టిన మిషన్ కాకతీయ పథకం మహాద్భుతం. గ్రామాల్లో ఆనవాళ్లు కోల్పోయిన చెరువులు, తూములు, పంట కాలువలకు మళ్లీ జీవం పోశారు. గొలుసుకట్టు చెరువులు నీళ్లతో కళకళలాడాయి. బీడు భూములు సైతం సాగులోకి వచ్చి రెండు పంటలు పండాయి. రైతులకు ఈ పథకంతో ఎంతో మేలు జరిగింది.
-న్యాలకంటి భోజన్న, రైతు ముల్లంగి(బీ)