నిజామాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వానకాలం పంటలు సాగుచేస్తున్న రైతులకు నకిలీ విత్తనాల గండం పొంచి ఉన్నది. ఆదిలోనే వీటిని అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం ఆలస్యంగా తనిఖీలు చేపట్టడడంతో సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చిన నకిలీ విత్తనాల విక్రయాలు ఇప్పటికే జరిగినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో వరినాట్లు పూర్తయిన దశలో అధికారులు తేరుకొని ఎరువుల దుకాణాల్లో తూతూ మంత్రంగా తనిఖీ చేపట్టడంతో నిర్వాహకుల అక్రమాలు వెలుగుచూస్తుండడం గమనార్హం. అంతేగాకుండా కాలపరిమితి ముగిసిన ఎరువులను విక్రయిస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడి కావడంతో కొనుగోలు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. లోపాలు బయటపడకుండా కొంతమంది వ్యవసాయాధికారులు వ్యాపారులతో కుమ్మక్కైనట్లు సమాచారం.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో విత్తన, ఎరువుల షాపుల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. గడువు ముగిసిన, నకిలీ, నాసిరకం విత్తనాలు, ఎరువులను విక్రయించడంతో పంట దిగుబడి దెబ్బతిని రైతులకు ఆర్థికంగా భారీగా నష్టాన్ని మిగులుస్తున్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో ఈ నెల మొదటి వారంలో ఇదే తరహాలో ఓ ఫర్జిలైజర్ దుకాణంలో లోపాలు వెలుగుచూడడం కలకలం రేపింది.
అధికారులు ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తే అనేక దుకాణాల్లో ఇదే తరహాలో లోటుపాట్లు వెలుగు చూసే అవకాశం ఉన్నది. తనిఖీలను పారదర్శకంగా నిర్వహిస్తే రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించే అవకాశం ఉంటుంది. వ్యవసాయాధికారులు మాత్రం వ్యాపారులతో చేతులు కలిపి తూతూ మంత్రంగానే దాడులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరలు వసూలు చేయడం, ముఖ్యంగా ఎరువుల సరఫరా కొరతను సృష్టించి సొమ్ము చేసుకుంటున్నారు. స్టాక్ రిజిస్టర్లను సరిగా నిర్వహించకపోవడం, తనిఖీ సమయంలో అధికారులకు సమర్పించకపోవడంలో ఎరువుల విక్రేతలు విఫలమవుతున్నారు.
కొన్ని దుకాణాలు లైసెన్స్ లేకుండా, గడువు ముగిసిన లైసెన్స్‌తో వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. రైతులకు తప్పుడు సమాచారం ఇవ్వడం, నాసిరకం ఉత్పత్తులను అధిక నాణ్యత కలిగినవిగా చెప్పి నిబంధనలను అతిక్రమిస్తున్నారు. ఎరువులు, విత్తనాలను కృత్రిమ కొరత సృష్టించడానికి హోర్డింగ్ చేయడంతో ధరలు పెరుగుతున్నాయి. ధ్రువీకరించని విత్తనాలు, నిషేధిత రసాయనాలతో కూడిన ఎరువులు, అనధికారిక ఉత్పత్తుల విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.
ఎరువులు, విత్తనాల విక్రయ దుకాణాలు తప్పనిసరిగా వ్యవసాయ శాఖ నుంచి లైసెన్స్ పొందాలి. లైసెన్స్ పొందడానికి దుకాణం యజమాని నిర్దేశిత అర్హతలు కలిగి ఉండాలి. దుకాణ స్థలం, నిల్వ సౌకర్యాలు నిబంధనలకు అనుగుణంగా, ఎరువులు, విత్తనాలు నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ఉదాహరణకు ఎఫ్సీవో, బీఐఎస్, సీడ్ సర్టిఫికెట్ స్టాండర్డ్స్ వంటివి పాటించాలి.
విత్తనాలకు సంబంధించి, ధ్రువీకరణ, నాణ్యత గుర్తింపు ఉండాలి. ఎరువులపై రసాయన కూర్పు, తయారీ, గడువు తేదీలు, బ్యాచ్ నంబర్ వంటి వివరాలు స్పష్టంగా లేబుల్‌పై ఉండాలి. ఎరువుల ధరలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన ప్రకారం ఎమ్మార్పీకి మాత్రమే విక్రయించాలి. విత్తన ధరలు తయారీదారు నిర్దేశించిన ధరలకు అనుగుణంగా ఉండాలి. దుకాణాలు తమ స్టాక్ వివరాలను రిజిస్టర్లో పొందుపర్చాలి. ఇందులో కొనుగోలు, విక్రయం, నిల్వల వివరాలు స్పష్టంగా ఉండాలి. అధికారుల తనిఖీ సమయంలో ఈ రికార్డులను సమర్పించాలి.
దుకాణంలో లైసెన్స్, ధరల జాబితా, స్టాక్ వివరాలను ప్రదర్శించాలి. రైతులకు ఎరువులు, విత్తనాల గురించి సరైన సమాచారం అందించాలి. ఎరువులు, విత్తనాలను తేమ, వేడి, ఇతర పర్యావరణ కారకాల నుంచి రక్షించే విధంగా నిల్వ చేయాలి. నాసిరకం, గడువు ముగిసిన ఉత్పత్తులను విక్రయించరాదు. కొన్ని దుకాణాలు ఎరువులు, విత్తనాలతో పాటు పురుగు మందులు కూడా విక్రయిస్తాయి. ఇవి ఇన్సెక్టిసైడ్స్ యాక్ట్ 1968 కింద నిబంధనలను పాటించాలి. ఇవేమీ సగానికి ఎక్కువ అమలు కావడం లేదన్నది బహిరంగ రహస్యం. అయినప్పటికీ చర్యలు తీసుకోవడంలో వ్యవసాయ శాఖ వెనుకాడుతుండడం విడ్డూరంగా మారింది.
కామారెడ్డి జిల్లాలో మొన్నటి వరకు వ్యవసాయ శాఖలో పని చేసిన ఓ అధికారి ఏకంగా వ్యాపారులతోనే కుమ్మక్కు అయినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. తనిఖీలకు వెళ్లినప్పుడు నాటు కోడి కూర తినబెడితే చాలన్నట్లుగా సదరు అధికారి వ్యవహారం ఉండేదని అంతా చెప్పుకున్నారు. దీంతోపాటు సీజన్‌కు రూ.20వేలు నుంచి రూ.30వేల వరకు బేరం మాట్లాడుకున్నట్లు ఆరోపణలున్నాయి. నిజామాబాద్ జిల్లాలోనూ నాలుగు నెలల క్రితం వరకూ ఓ అధికారి తీరు ఇదే రకంగా ఉండేది. ఏకంగా మండల వ్యవసాయాధికారి ఒకరు నేరుగా వ్యవసాయ శాఖ డైరెక్టర్‌కు ఆధారాలతో ఫిర్యాదు చేయడం వసూళ్ల తంతుకు నిదర్శనంగా నిలుస్తున్నది. ఎరువులు, విత్తన వ్యాపారులతో కుమ్మక్కై ఇష్టారాజ్యంగా వ్యవహరించడం పలువురు వ్యవసాయాధికారులకే చెల్లింది.
అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎరువులు, విత్తన దుకాణాల్లో నిబంధనల ఉల్లంఘనలు జరిగితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రైతులు, ఇతర వినియోగదారులు స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయం లేదా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదులను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ వెబ్సైట్ లేదా ఈ-కృషి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో కూడా సమర్పించవచ్చు. నాసిరకం ఉత్పత్తులు, అధిక ధరలతో నష్టపోయిన రైతులు జిల్లా వినియోగదారుల ఫోరంలోనూ ఫిర్యాదు చేయవచ్చు. రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు బిల్లు తీసుకోవడం, లేబుళ్లను పరిశీలించడం, నాణ్యత గురించి అవగాహన కలిగి ఉండడం ముఖ్యం. వ్యవసాయ శాఖ హెల్ప్‌లైన్ నంబర్లు 1800-425-0430 లేదంటే స్థానిక వ్యవసాయాధికారులను సంప్రదించడం ద్వారా సమస్యలను నివేదించవచ్చు. అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించేలా రైతు సంఘాలు, స్థానిక సంస్థల ద్వారా ఒత్తిడి తెప్పించవచ్చు.