నిజామాబాద్, ఫిబ్రవరి 26, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆడ పులి జాడ కోసం ఆవాసాన్ని వదిలి బయటకు వచ్చిన పెద్ద పులి తిరిగి వచ్చిన మార్గంలో వెనక్కి మళ్లుతోంది. మూడు నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో 11 జిల్లాల్లో అలజడి సృష్టించిన మూడున్నరేళ్ల పులిని అటవీ శాఖ నిశితంగా గమనిస్తోంది. ప్రతి కదలికను తెలుసుకుంటూ పెద్ద పులి జాడను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.
ఈసారి ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(పీసీసీఎఫ్) సువర్ణ రంగంలోకి దిగడంతో అటవీ అధికారులంతా పులిని రక్షించేందుకు ముందడుగు వేశారు. అక్కడక్కడ కొంత మంది అటవీ అధికారుల నిర్లక్ష్యం వల్ల పెద్ద పులి ప్రాణాలకు ముప్పును తెచ్చి పెడుతున్నప్పటికీ మరికొంత మంది కృషితో మేలు చేకూరుతోంది. తమ అటవీ క్షేత్రాల్లోకి పులి రాకపోతే బాగుండు అనుకునే స్థాయిలో కొందరు అధికారులు తర్జనభర్జన పడుతుండగా… పెద్ద పులిని కాపాడుకునేందుకు సాహసోపేతంగా అడవుల్లో సంచరిస్తూ మిగిలిన వారంతా ప్రయత్నిస్తున్నారు.
దట్టమైన అడవుల్లో పాద ముద్రికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ మిగిలిన క్షేత్రాల్లో పని చేస్తున్న బీట్, సెక్షన్, రేంజ్ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన పెద్ద పులి గడిచిన మూడు నెలలుగా అటవీ శాఖకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మేటింగ్(లైంగిక సంపర్కం) కోసం ఆడ పులి జాడను వెతుక్కుంటూ వెళ్తున్న క్రమంలో ఆకలి తీర్చుకునేందుకు పదుల సంఖ్యలో దాడులు చేసి పశువులను హతమార్చిన ఘటనలు వెలుగు చూశాయి. ఎస్12 అనే ఐదేళ్ల మగ పులి జాడను కనుక్కోలేక చేతులు ఎత్తేసిన కామారెడ్డి అటవీ శాఖకు మరో పులి సంచారం సవాల్‌గానే మారింది. నిజామాబాద్ జిల్లా సిరికొండ అటవీ ప్రాంతాల్లో పులి జాడపై అధికారులు పరిశీలన చేయడం ఆసక్తిని పెంచుతోంది.
మహారాష్ట్ర తిప్పేశ్వర్ నుంచి పెన్‌గంగా నది దాటుకున్న పెద్ద పులి తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా బేలా, కెరమేరి, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లోకి తొలుత ప్రవేశించింది. అనంతరం మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్లా కామారెడ్డి, సిద్ధిపేట, జనగాం, యాదా ద్రి భూననగిరి జిల్లాలో కలియ తిరిగింది. వచ్చిన దారిలో ప్రస్తుతం వెనక్కి వస్తోంది. ఈక్రమంలో పులి పాదముద్రికలు ద్వారా సిద్ధిపేట, జగిత్యాలలో ఉన్నట్లుగా అటవీ అధికారులు గుర్తించారు. కరీంనగర్, జగిత్యాల వైపు మళ్లి తిరిగి కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాకు అట్నుంచి మహారాష్ట్ర వైపునకు వెళ్లేందుకు ఆస్కారం ఏర్పడింది.
అటవీ శాఖ డ్రోన్లు, ట్రాకర్లు, ట్రాప్ కెమెరాలతో ఎప్పటికప్పుడు పెద్ద పులి జాడపై నిఘా పెట్టారు. మూడున్నరేళ్ల పులి సుదీర్ఘ ప్రయాణంలో ఎక్కడ కూడా మానవులపై దాడి చేయలేదు. ఆకలి తీర్చుకునేందుకు పశువులపై అనేక చోట్ల దాడులు చేసి ఆరగించింది. సరైన చర్యలు చేపట్టకపోవడంతోనే పెద్ద పులి గందరగోళానికి గురై వెంటవెంటనే పశువులపై దాడులు చేయసాగింది. పులి సంచరించిన ప్రాంతాల్లో మానవుల జాడ అధికంగా ఉండటంతో ప్రశాంతంగా కార్కస్ను పులి ఆరగించలేదు. సురక్షిత ప్రాంతానికి వెళ్తూ దాడులు చేస్తూ పోయింది. పులి తిరుగుతున్నదనే సమాచారంతో సామాన్య జనం ఎగబడటం కూడా ఇందుకు కారణమేనని తెలుస్తోంది.
మగ పెద్ద పులి మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి ప్రవేశించింది. అటవీ అధికారుల అంచనా ప్రకారం మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ వన్యప్రాణాలు అభయారణ్యంలోని పాండవ్ఖరా డివిజన్ నుంచి దీని ప్రయాణం మొదలైంది. నవంబర్ 2025 చివరి నాటికి మహారాష్ట్ర నుంచి పెన్‌గంగా నదిని దాటింది. ఆదిలాబాద్ జిల్లాలోని బేలా, కెరమేరి, జైనూర్‌లో మొదటగా పాద ముద్రలు బయట పడ్డాయి. అక్కడి నుంచి కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లోకి చేరింది. సుమారు 2 వారాలుగా ఆడ పులి కోసం కవ్వాల్లోనే సంచరించింది.
డిసెంబర్ మొదటి వారంలో దక్షిణ భాగం వైపునకు కదిలి అనేక జిల్లాలను చుట్టేసింది. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్లా జిల్లాలోని అటవీ మార్గాల ద్వారా కామారెడ్డిలోకి ప్రవేశించింది. మాచారెడ్డి, పాల్వంచ, బీబీపేట, భిక్కనూర్ మండలాల్లో పశువులపై దాడులు చేసింది. ట్రాప్ కెమెరాల్లోనూ పెద్ద పులి జాడ లభించింది. తీవ్ర అలజడి అనంతరం ఇక్కడ్నుంచి దిగువ దక్షిణం వైపునకే పులి పయనించింది. సిద్ధిపేటలోని తోగుట మండలంలోని ఆరెపల్లి, పీర్లపల్లి గ్రామాల్లో అలజడి సృష్టించింది. అక్కడ్నుంచి జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాలోకి వెళ్లింది.
జనవరి 17 నుంచి భువనగిరి మండలంలోని తుర్కపల్లి, ఇబ్రహీంపూర్, దత్తాయిపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లోనే నెలన్నర రోజులకు పైగా మకాం వేసింది. పదికి పైగా పశువులపై దాడి చేసి ఆకలి తీర్చుకున్నది. ఫిబ్రవరి మొదటి వారం నుంచి వచ్చిన దారిలోనే ఉత్తర దిక్కుకు పెద్ద పులి పయనం కావడం మొదలైంది. ఈ క్రమంలో గాండ్లమల్ల, కొండాపూర్, శ్రీనివాసపూర్, చిన్న లక్ష్మీపురం వంటి గ్రామాల్లో దాడులు చేసింది. ప్రస్తుతం సిద్ధిపేట జిల్లా ఆరెపల్లి గ్రామంలో ప్రత్యక్షమైంది. రాజన్న సిరిసిల్లా, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా సరిహద్దులకు ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాల గుండా పులి తిరుగు ప్రయాణించేందుకు అవకాశాలు ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.
తన టెరిటరీ(సొంత భూభాగం) నుంచి బయటకు వచ్చిన పెద్ద పులి తిరిగి అటువైపే వెళ్తుండటం వన్య ప్రాణి ప్రేమికుల్లో చర్చకు దారితీస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్(కేటీఆర్) మినహాయిస్తే మిగిలిన ప్రాంతాల్లో పులికి ఆవాసయోగ్యమైన ప్రాంతాలు లేనట్లుగా కనిపిస్తోందని పలువురు చర్చించుకుంటున్నారు. మూడు దశాబ్దాల తర్వాత కామారెడ్డి ప్రాంతంలో అలజడి సృష్టించిన పెద్ద పులి రాకను వన్యప్రాణి ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద పులి సంచారంతో అటవీ క్షేత్రాలు అభివృద్ధి చెందుతాయని భావిస్తున్నారు. ఎస్ 12 పులి ఇదే మార్గంలో వచ్చి ఆచూకి లేకుండా పోగా మూడున్నరేళ్ల పెద్ద పులి సజీవంగా సంచరిస్తుండంపై సంతోషిస్తున్నారు.