గద్వాలటౌన్, ఫిబ్రవరి 26 : గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని రాఘవేంద్రకాలనీలో వారం రోజుల నుంచి తాగునీటి సరఫరా లేకపోవడంతో గురువారం మహిళలు రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. వారం నుంచి తాగునీరు రావడం లేదని ఈ సందర్భంగా మహిళలు వాపోయారు. కాలనీలో పట్టణానికి నీటి సరఫరా చేసే రెండు నీటి ట్యాంకులు ఉన్న తమకు మాత్రం వారం రోజుల నుంచి నీరు సరఫరా కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంలో అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వేసవి ప్రారంభానికి ముందే ఇలా ఉంటే మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని మహిళలు భయాందోళనలకు గురువుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.