నిజామాబాద్, ఫిబ్రవరి 11, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) మున్సిపల్ ఎన్నికల నిర్వాహణలో ఎన్నికల యంత్రాం గం వైఫల్యం పలు చోట్ల స్పష్టంగా కనిపించింది. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా పట్టణ ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలకు పోలీసులు కొమ్ము కాశారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఎల్లారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు దర్జాగా తన అనుచరగణంతో ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా ప్రవర్తించడం వివాదాస్పదమైంది. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. పోలీసుల వైఖరిని ఎండగట్టారు. సరైన సమాధానం చెప్పకపోగా బీఆర్ఎస్ నేతలపైనే పోలీసులు జులుం ప్రదర్శించారు. దీంతో నడి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆర్మూర్‌లో కాంగ్రెస్ కండువాలను ధరించి పోలింగ్ బూతుల్లోకి వెళ్లిన కార్యకర్తలను పోలీసులు అనుమతించడంపై బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భీంగల్ మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డట్లుగా ఆరోపణలు వెలుగు చూశాయి. పలు పోలింగ్ బూతుల్లో తిరగడంపై బీఆర్ఎస్ అభ్యంతరం తెలపడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు వెనుదిరిగారు.
నిజామాబాద్ నగరంలోని హరిచరణ్ మార్వాడి స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ హంగామా సృష్టించాడు. కోడ్ ఆఫ్ కండక్ట్‌ను పూర్తిగా ఉల్లంఘించి పోలీసులను బూతులు తిడుతూ హల్చల్ చేశాడు. యూస్ లెస్ ఫెల్లోస్… ఒళ్లు బలిసిందా… కళ్లు నెత్తికెక్కిందా… అం టూ వ్యాఖ్యానాలు చేస్తూ పోలింగ్ బూతుల్లోకి కార్యకర్తలతో దూసుకెళ్లాడు. ఎంపీతో పాటు పోలింగ్ బూతుల్లోకి వెళ్లిన వారి వెంట నిబంధనలకు విరుద్ధంగా మొబైల్ ఫోన్లు సైతం ఉండటం గమనార్హం. పోలీసులపై దురుసుగా ప్రవర్తించడంతో పాటుగా ఖాకీ దుస్తుల్లో ఉన్న పోలీస్ అధికారులను తిట్టడంపై ప్రజలంతా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై పోలీస్ ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో? వేచి చూడాల్సి ఉంది.
ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడటాన్ని నిషేధిస్తూ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలు నిర్వహిస్తున్న ప్రాంతాల్లో 100 మీటర్ల దూరంలో అలజడి సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బుధవారం జరిగిన పోలింగ్ ప్రక్రియలో చాలా చోట్ల పదుల సంఖ్యలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన శ్రేణులు గుమిగూడటం కనిపించింది. పోలింగ్ బూతులకు సమీపంలోనే గుంపులు కలియ తిరిగినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. పలు చోట్ల పదుల సంఖ్యలో పోగైన రాజకీయ పార్టీల నేతలతోనే ఘర్షణలు, తోపులాటలు చోటు చేసుకున్నాయి. గూపన్పల్లి కమాన్ బీజేపీ, కాంగ్రెస్ నేతలు హోరాహోరీగా పోగై శాంతి, భద్రతలకు ఇబ్బందులు సృష్టించారు. బందోబస్తులో ఉన్న ఏసీపీ రాజా వెంకట రెడ్డి, సీఐ, ఎస్సైలు లాఠీలకు పని చెప్పారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేశ్ చేరుకుని మెడలోని కాషాయ కండువాను గాల్లో తిప్పుతూ హల్చల్ చేశారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయం పక్కనే పోలీస్ లైన్ పోలింగ్ బూత్ వద్ద ఇలాంటి దుస్థితి ఏర్పడింది. వినాయక్ నగర్, ప్రగతినగర్, కోటగల్లి, ఖిల్లా ప్రాంతాల్లోనూ ఇదే దుస్థితి ఏర్పడింది. పలు చోట్ల భారీగా గుమ్మిగూడిన వ్యక్తులను పోలీసులు చెదరగొట్టారు. సెక్షన్ 144(బీఎన్ఎస్ఎస్ ప్రకారం సెక్షన్ 163) కేవలం కాగితాలకే పరిమితమైందని ప్రజలంతా భావించారు.
పారదర్శకంగా నిర్వహించాల్సిన పోలింగ్ ప్రక్రియను అపహాస్యం చేశారు. పోలీసులు బహిరంగంగానే కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతుండడం దురదృష్టం. వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తున్నాను. కాంగ్రెస్ కండువాలు ధరించి పోలింగ్ బూత్‌లకు వెళ్లిన వారిని అడ్డుకోవడం లేదు. పైగా వారికి సహకరిస్తుండడం ఖాకీల తీరును ప్రస్ఫుటం చేస్తోంది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి. కానీ అలాంటి పరిస్థితి కనిపించలేదు.
– ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు
ఎల్లారెడ్డిలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. అధికార పార్టీ నేతలకు పోలీసులు అండగా నిలవడం దుర్మార్ఘం. అడుగడుగునా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ మాపై బల ప్రయోగానికి పాల్పడుతున్నారు. ప్రజల విశ్వాసాన్ని, మద్ధతును దక్కించుకోవడం చాతకాక దొడ్డిదారిలో ప్రజలను బెదిరించి, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఇష్టానుసారంగా ప్రవర్తించడం హేయమైంది. అధికార పార్టీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేతలు యథేచ్ఛగా కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘిస్తే పోలీసులు అడ్డు చెప్పకపోవడం దురదృష్టం.
– జాజాల సురేందర్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే