Actor Vishal | ప్రముఖ నటుడు విశాల్ ఇటీవల తన తాజా చిత్రం ‘మకుటం’ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తమిళనాడు రాజకీయాలపై, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మరియు ఆయన అరెస్ట్ పరిణామాలపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. రాజకీయ నాయకులు బహిరంగ వేదికలపై మాట్లాడేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే ఇలాంటి ఊహించని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉదయనిధి స్టాలిన్ ప్రసంగాన్ని తాను స్వయంగా చూశానని, ప్రతి ఒక్కరికీ భావప్రకటన స్వేచ్ఛ ఉంటుందని, అయినప్పటికీ కొన్ని సున్నితమైన విషయాలలో హద్దులు దాటకుండా ఉండటం చాలా ముఖ్యమని విశాల్ హితవు పలికారు.
ముఖ్యంగా రాజకీయ ప్రసంగాలు చేసేటప్పుడు ముందుగానే స్క్రిప్ట్ రాసుకుని దాని ప్రకారం మాట్లాడితే ఇలాంటి వివాదాలకు ఆస్కారం ఉండదని, అయితే సభల్లో అప్పటికప్పుడు ఉత్సాహంతో సహజంగా మాట్లాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు. లయోలా కాలేజీలో తనతో పాటు చదువుకున్న తన సీనియర్ విజయ్, తన బ్యాచ్‌మేట్ అయిన ఉదయనిధి స్టాలిన్ ఒకరోజు ఇలా ఊహించని రీతిలో అరెస్ట్ అవుతారని తాను కలలో కూడా ఊహించలేదని విశాల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం విజయ్ కూడా పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టారని, ఇవన్నీ ప్రస్తుత రాజకీయాల్లో సర్వసాధారణమైన భాగమేనని, ఇదే అసలైన రాజకీయం అంటే అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే, నటుడు విశాల్ త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నాడనే ప్రచారం తమిళనాడు రాజకీయ వర్గాల్లో మరియు సినీ ఇండస్ట్రీలో విపరీతంగా జరుగుతోంది. ఇప్పటివరకు సినిమాల ద్వారా తాను సంపాదించుకున్న మంచి పేరును, ప్రజా సేవకు పూర్తిగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు ఇటీవల ఒక బహిరంగ వేదికపై విశాల్ స్వయంగా వెల్లడించడంతో ఈ పొలిటికల్ ఎంట్రీ వార్తలకు మరింత బలం చేకూరింది. త్వరలోనే ఆయన అధికారికంగా రాజకీయ రంగప్రవేశం చేసే అవకాశం ఉందని కోలీవుడ్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి.