వానాకాలం ప్రారంభంతోనే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. అష్టకష్టాలతో యాసంగి సీజన్‌ను దాటుకొని ముందుకు వచ్చిన కర్షకులకు మరోసారి ఉపద్రవం ముంచుకొస్తోంది. వర్షాకాలం మొదలై మూడు వారాలు కావొస్తున్నప్పటికీ వర్షాలు ఆశించిన స్థాయిలో కురువలేదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చాలా చోట్ల లోటు వర్ష్షపాతమే నమోదైంది. దీంతో నీటి జాడ లేక సాగులో అన్నదాతలంతా తడబాటుకు గురవుతున్నారు. ఏం చేయాలో తెలియక వరుణదేవా… కరుణించవా… అంటూ మొగులు వైపు చూడాల్సి వస్తున్నది. భూగర్భ జలం తగ్గిపోవడం, కరెంట్ కోతలు వెరసి వర్షాలు లేకపోవడంతో రైతులకు తీవ్రమైన అగచాట్లు ఎదురవుతున్నాయి. వానకాలం కావడంతో అత్యధిక శాతం మంది రైతన్నలంతా వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. ఇందులో భాగంగా వరి నారుమడులు వేసుకునేందుకు సమాయత్తం అవుతుండగా నీళ్ల కొరతతో వెనుకడుగు వేస్తున్నారు. కేవలం బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో మాత్రమే వరినాట్లు మొదలయ్యాయి. మిగిలిన చోట్ల దుక్కి దున్నేందుకే రైతులు సమాలోచనలు చేస్తున్నారు. నాలుగైదు మార్లు కురిసిన చిన్నపాటి వానలకు దుక్కి దున్నేందుకు కూడా పొలాలు అనుకూలంగా లేకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
సీజన్ ప్రారంభంతోనే నైరుతి రుతుపవనాల రాక మొదలైందన్న ప్రచారం జోరుగా వినిపించింది. భారీ వానలు కురుస్తాయన్న అంచనాలు సై తం ప్రభుత్వవర్గాలు విడుదల చేశాయి. చిరుజల్లులతో కూడిన వానలు పడడంతో రైతన్నలంతా పంటల సాగుకు ఢోకా లేదనుకొని సిద్ధమయ్యారు. బా ల్కొండ నియోజకవర్గంలో చాలా మంది సోయాబీన్ విత్తుకున్నారు. పదిహేను రోజుల క్రితం నుంచి చినుకు జాడ లేకపోవడంతో విత్తిన సోయా ఎటూ కాకుండా పోతున్నది. మొలకెత్తాల్సిన సోయాబీన్ పత్తా లేకపోవడంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తున్నది. సోయాబీన్ పంటల సాగుకు నడుం బిగించిన వారంతా పెట్టిన పెట్టుబడి డబ్బులు కూడా చేతికి రాక, సీజన్ ఆరంభంలోనే నష్టాలు చవిచూడడంతో తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ఇలా చాలా చోట్ల పంటల సాగుపై వర్షాభావ పరిస్థితులు రైతులను దెబ్బతీస్తున్నాయి. నెలన్నర రోజుల క్రితమే యాసంగి పంట ఉత్పత్తులను అమ్ముకొని వానకాలం పంటల సాగుకు సిద్ధమైన వారంతా వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. నిరాశజనకమైన వాతావరణ పరిస్థితుల మూలం గా ఏమీ చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ గడ్డు పరిస్థితిలో వ్యవసాయ శాఖ అధికారులు అండగా నివాల్సిన అవసరం ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదు. రైతులకు సలహాలు, సూచనలు అందివ్వాల్సిన ఏఈవోలు, ఏవోలు మిన్నకుండి పోవడంతో రైతులు నిలువునా నష్టాలను మూట కట్టుకోవాల్సిన దుస్థితి దాపురిస్తున్నది.
నిజామాబాద్ జిల్లాలో సగానికి ఎక్కువ మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. మొత్తం 33మండలాలకు కేవలం మూడు మండలాల్లోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. ఎనిమిది మండలాల్లో సాధారణ వర్షపాతం ఉండగా 13 మండలాల్లో లోటు వర్షపాతం, 9 మండలాల్లో తీవ్రమైన దుర్భిక్షమే కొట్టుమిట్టాడుతున్నట్లుగా ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. నందిపేట, నవీపేట, సిరికొండ మండలాలు మినహాయిస్తే మిగిలిన అన్ని మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. జూన్ 1 నుంచి నేటి వరకు నిజామాబాద్ జిల్లాలో సరాసరి సాధారణ వర్షపాతం 65.4 మిల్లీమీటర్లు ఉండగా కేవలం 44.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 21.5శాతం లోటు వర్షపాతం కొనసాగుతున్నది. కామారెడ్డి జిల్లాలోనూ ఇదే దుస్థితి నెలకొన్నది. 24మండలాల్లో సేకరించిన వివరాల ప్రకారం జూన్ 1 నుంచి ఇప్పటి వరకు కామారెడ్డి జిల్లాలో సరాసరి సాధారణ వర్షపాతం 73.6 మిల్లీ మీటర్లు ఉండ గా 63.7 మి.మీల వర్షం కురిసింది. 13.4శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు అధికారిక వర్గాల నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇందులో నాగిరెడ్డిపేట, తాడ్వాయి మండలాల్లో అతిభారీ వర్షాలు కురవగా, బిచ్కుంద, లింగంపేట, రామారెడ్డి మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఏడు మండలాల్లో సాధారణం, తొమ్మిది మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. నస్రుల్లాబాద్, బాన్సువాడ, దోమకొండలో వర్షపు నీటిచుక్క దిక్కులేదు.
మంచి వర్షాలు కురిసే వరకు రైతులు వేచి చూడడం ఉత్తమం. వాతావరణ పరిస్థితుల ప్రకారం, వ్యవసాయాధికారుల సలహాలతో రైతులు ముందుకు వెళ్లాలి. చలక భూముల్లోపై పొరలు మాత్రమే తడిసేంత వానలు ప్రస్తుతానికి కురిశాయి. తిరిగి ఎండలు కొట్టగానే భూమిలో తడి ఆరిపోయే ప్రమాదం ఉంటుంది. అరకొర వానలతోనే రైతులు తొందరపడి సోయాబీన్, మక్కజొన్న విత్తుకుంటే నష్టపోయే అవకాశం ఉంటుంది. కనీసం 8 నుంచి 10 సెం.మీటర్లు మేర భూమి తడిసిన తర్వాతనే విత్తు కోవడం ఉత్తమం. బోర్ల కింద వరినాట్లు వేసేవారు కూడా జాగ్రత్తగా అందుబాటులో ఉన్న వనరులు, భూగర్భ జలాన్ని అంచనా వేసుకుంటూ నాట్లు వేసుకోవాలి. లేదంటే మధ్యకాలిక, స్వల్పకాలిక వరి వంగడాలను ఎంచుకోవడం ఉత్తమం.