బోధన్ రూరల్, డిసెంబర్ 26: రెండు నెలలుగా వేతనాలు అందక ఉపాధి హామీ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల స్థాయి అధికారితో పాటు టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లకు రెండు, మూడు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 31 మండలాల్లో కూలీలకు 100 రోజుల పని దినాలు కల్పిస్తున్నారు.
ఉపాధి హామీ పథకంలో జిల్లా వ్యాప్తంగా 315 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 70 మంది టెక్నికల్ అసిస్టెంట్లు, 45 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, 10 మంది ఈసీలు, 22 మంది ఏపీవోలు పని చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 2.57 లక్షల జాబ్‌కార్డులు ఉండగా, ఇందులో1.56 లక్షల జాబ్‌కార్డులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయి. మొత్తం 2.30 లక్షల మంది కూలీలు పనులకు వెళ్తున్నారు. ఈ పథకంలో పనిచేసే సిబ్బందికి కొందరికి రెండు నెలలు, మరికొందరికి మూడు నెలల నుంచి వేతనాలు రాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. కుటుంబ పోషణ కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు.
మాకు మూడు నెలలుగా వేతనాలు రావడం లేదు. అధికారులను అడిగితే నిధులు లేవని చెబుతున్నారు. మాకు ఉద్యోగ భద్రత కూడా లేదు. వచ్చే కొద్దిపాటి జీతం కూడా నెలనెలా ఇవ్వకపోవడంతో అవస్థలు పడుతున్నాం. పిల్లల చదువులు, అవసరాలకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది.
-సాయికుమార్, ఫీల్ట్ అసిస్టెంట్, పెంటాకలాన్ గ్రామం, బోధన్మండలం
మాకు మూడు నెలలుగా జీతం రావడంలేదు. కుటుంబం నడవడం కష్టంగా మారుతున్నది. పిల్లల చదువులు, ఇంటి అవసరాలను తీర్చలేకపోతున్నం. అధికారులను అడిగితే వస్తాయని చెబుతున్నారు. ఎప్పుడు వస్తాయో చెబుతలేరు. ఉద్యోగంపై ఆధారపడి బతుకుతున్న మాకు జీతాలు రాక చాలా ఇబ్బందిగా ఉన్నది.
-వినోద్, ఫీల్డ్ అసిస్టెంట్, లంగ్డాపూర్ గ్రామం, బోధన్ మండలం