Bodhan Municipal Office | శక్కర్ నగర్ : గత రెండు రోజులుగా ఓ పత్రికతో పాటు, యూట్యూబ్ ఛానల్లో ప్రచురితమైన నిరాధార ఆరోపణలు ఖండిస్తూ బోధన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట బుధవారం మున్సిపల్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ తో పాటు ఏ ఈ శ్రీనివాస్ లపై నిరాధార వార్తలు రాయడానికి వారు తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా ఏఈలు శ్రీనివాస్, ముఖయ్యర్ మాట్లాడుతూ కమిషనర్, ఏఈ, సిబ్బంది ఏవైనా అక్రమాలకు పాల్పడితే ఆధారాలతో వార్తలు రాయాలని కోరారు. నిరాధార వార్తల కారణంగా తమను మానసికంగా ఇబ్బందులకు గురి చేయడమే తప్ప ఇంకోటి కాదని అన్నారు. ఇలాంటి వార్తల వల్ల తమతోపాటు తమ కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందులకు గురవుతారని, దీంతో పనులు చేయడంలో ఇబ్బందిగా మారుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దుష్ప్రచారాలు వల్ల తాము ప్రజలకు సరైన సేవలు అందించలేక పోతామని వారు అన్నారు.
తాము తప్పులు చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమే అని వారు స్పష్టం చేశారు. మరోమారు ఇలాంటి దుష్ప్రచారాలకు పాల్పడితే పెన్ డౌన్ నిర్వహించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్తామని ఉద్యోగులు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రమేష్, ఏఈలు శ్రీనివాస్, ముఖయ్యర్, తో పాటు మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.