బాన్సువాడ, ఫిబ్రవరి 5: దేశంలోనే వందశాతం రాయితీపై చేప పిల్లలను పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శనివారం ఆయన బాన్సువాడ పట్టణంలో రూ. 65 లక్షలతో నిర్మించిన చేపల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడారు. తాను పల్లెటూరులో పుట్టానని, మత్స్యకారుల కష్టాలను కళ్లారా చూశానని అన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో మత్స్యకారులకు ఇచ్చే రాయితీ పై ఆలోచన చేశానని తెలిపారు. వందశాతం రాయితీపై ఇవ్వాలనే ప్రతిపాదన సీఎం కేసీఆర్ మనసులో నుంచి వచ్చిందన్నారు. దళారుల ప్రమేయం లేకుండా మత్స్యకారులు చేపలను విక్రయించుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా ఇతర ప్రాంతాలకు వెళ్లి చేపలు అమ్ముకోవాలని మత్స్యకారులకు రాష్ట్రవ్యాప్తంగా 70వేల మోపెడ్ వాహనాలను అందజేసినట్లు తెలిపారు.
బాన్సువాడ నియోజకవర్గంలో 484 మంది మత్స్యకారులకు ద్విచక్ర వాహనాలను అందించినట్లు చెప్పారు. కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మాట్లాడుతూ.. మత్స్యకారులకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నిరకాల వసతులు కల్పించారని చెప్పారు. ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. బాన్సువాడ పట్టణం ఎంతో అభివృద్ధి చెందినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్రనాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్, డీఎస్పీ జయపాల్ రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, వైస్ చైర్మన్ షేక్ జుబేర్, సొసైటీ అధ్యక్షుడు ఏర్వాల కృష్ణారెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ, డి శ్రీనివాస్ , జడ్పీటీసీ పద్మా గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడ డివిజన్ కేంద్రంలో రూ. 30 లక్షలతో నిర్మించనున్న పోలీసు కాంప్లెక్స్ భవనం, రూ. 2 కోట్లతో చేపట్టనున్న మున్సిపాలిటీ కార్యాలయ భవనం, రూ. 50 లక్షలతో నిర్మించనున్న తహసీల్ కార్యాలయం, రూ.2 కోట్లతో నిర్మించనున్న వెజ్, నాన్‌వెజ్ సమీకృత మార్కెట్ దుకాణ సముదాయాలకు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డితో కలిసి స్పీకర్ పోచారం భూమిపూజ, శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమంలో నాయకులు నామాల శంకర్, జిల్లా మత్స్య సంఘం నాయకులు గంగారాం, సంగప్ప, సత్యం తదితరులు పాల్గొన్నారు.