స్వరాష్ట్రంలో సర్కారు బడి సరికొత్తగా రూపుదిద్దుకున్నది. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తున్నది. సమైక్య రాష్ట్రంలో ప్రాభవం కోల్పోయిన ప్రభుత్వ విద్యా వ్యవస్థ తెలంగాణలో బలోపేతమైంది. కేసీఆర్ సర్కారు అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఫలితంగా పేదింటి బిడ్డలకు కార్పొరేట్ తరహా విద్యాబోధన అందుతున్నది. ఒకనాడు వెలవెలబోయిన ప్రభుత్వ పాఠశాలలు నేడు కళకళలాడుతున్నాయి. గురుకులాల స్థాపనతో ప్రైవేట్ విద్యాసంస్థలు కళ తప్పాయి. గురుకులాలు, ప్రభుత్వ బడుల్లో విరివిగా ప్రవేశాలు పెరిగాయి. సకల వసతులు, స్మార్ట్ క్లాసులు విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. దీంతో ప్రైవేట్‌ను కాదని ప్రభుత్వ విద్యాలయాలకే మొగ్గు చూపుతున్నారు. తొమ్మిదేండ్లలో విద్యారంగంలో సాధించిన విజయాలకు గుర్తుగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు విద్యాదినోత్సవం నిర్వహించనున్నారు.
– కామారెడ్డి/ఖలీల్‌వాడి, జూన్ 19
కామారెడ్డి/ ఖలీల్‌వాడి, జూన్ 19: స్వరాష్ట్రంలో సర్కారు విద్యాసంస్థలు కార్పొరేట్ స్థాయికి చేరాయి. గత ప్రభుత్వాల హయాంలో కనీస మరమ్మతులకు సైతం నోచుకోని పాఠశాలలు, వసతి గృహాలు… ప్రస్తుతం సకల సౌకర్యాలతో కళకళలాడుతున్నాయి. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దింది. రూ.కోట్లు వెచ్చించి వాటిని అధునాతనంగా మారుస్తున్నది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది. సర్కారు బడుల్లో ఇంగ్లిష్ చదువులు అందుబాటులోకి రావడంతో పేద విద్యార్థులకు ఎంతగానో మేలు చేకూరింది. కార్పొరేట్ చదువులు చదవాలనే ఆకాంక్షతో ప్రైవేట్ పాఠశాలలో రూ.లక్షలు వెచ్చించి ఇబ్బందిపడ్డ మధ్యతరగతి, పేద విద్యార్థులకు ఎంతో ఊరటనిస్తున్నది.
కార్పొరేట్ విద్యాసంస్థల్లో అందించే సౌకర్యాలను ఉచితంగా కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నది. అత్యుత్తమ విద్య, మేలైన సౌకర్యాలు, పౌష్టికాహారం అన్నీ కలిపి వసతిగృహాల్లో విద్య, వసతితో భళా అనిపించేలా ప్రభుత్వం ముందడుగు వేస్తున్నది. ప్రభుత్వ హాస్టళ్లలో వసతి సౌకర్యాలు రోజురోజుకూ మెరుగవుతున్నాయి. అధునాతన సదుపాయాలతో విద్యార్థులకు సకలం అందిస్తుండడంతో పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఆర్థిక స్థోమత లేని వారంతా పుస్తకాలు, దుస్తులు, బూట్లు, మంచం, పరుపు, దిండు వంటి కార్పొరేట్ స్థాయి సదుపాయాలను పొందడం కలగానే ఉండగా… ఇప్పుడదీ నిజమవుతున్నది. సర్కారు బడి అంటేనే చిన్నచూపు చూసే స్థాయి నుంచి ప్రభుత్వ పాఠశాలే మంచిదనే ఆలోచనకు వస్తున్నారు పలువురు తల్లిదండ్రులు. తెలంగాణ సర్కారు పాఠశాలల్లో సకల వసతులు కల్పించడంతో ప్రైవేటును మరిపిస్తున్నాయి. విద్యాబోధనలోనూ ఇతర పాఠశాలలకు పోటీగా నిలుస్తున్నాయి. విద్యా, క్రీడా, సాంస్కృతిక, సైన్స్ ఫెయిర్ తదితర విభాగాల్లోను ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రాణిస్తున్నారు.
కామారెడ్డిలో 1011 పాఠశాలలు..
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు 1011 ఉండగా ఇందులో 696 ప్రాథమిక,126 ప్రాథమికోన్నత,189 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. కేజీబీవీలు 19, మోడల్ స్కూల్ 6, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ (నేతాజి సుభాష్ చంద్రబోస్ విద్యాలయం) 1, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సొసైటీ 1, ఎయిడెడ్ 5, సోషల్ వెల్ఫేర్ 11, మైనార్టీ వెల్ఫేర్ 6, బీసీ వెల్ఫేర్ (మహాత్మాగాంధీ జ్యోతి బాపూలే) 7, ట్రైబల్ వెల్ఫేర్ 3, గిరిజన ఆశ్రమ పాఠశాలలు 4 ఉన్నాయి.
నిజామాబాద్ జిల్లాలో..
ప్రైమరీ స్కూళ్లు – 770
అప్పర్ ప్రైమరీ స్కూళ్లు -133
ఉన్నత పాఠశాలలు – 255
కేజీబీవీ – 25
టీఎస్ మోడల్ స్కూళ్లు – 10
టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐ సొసైటీ స్కూళ్లు – 3
మైనార్టీ వెల్ఫేర్ స్కూళ్లు -17
ఎంజేపీటీ స్కూళ్లు – 13
సోషల్ వెల్ఫేర్ స్కూళ్లు – 9
ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్లు -2
టీఎస్ఈఎంఆర్ఎస్ స్కూళ్లు -1
ఆశ్రమ పాఠశాలలు -2
కొండంత భరోసా..
ప్రభుత్వ హాస్టళ్లలో చేరే విద్యార్థులకు కొండంత భరోసానిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. నాణ్యమైన విద్యను అందించడంతోపాటు పౌష్టికాహారం పెడుతుండడంతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు నెలకు నాలుగు సార్లు చికెన్ వండి పెడుతున్నారు. ప్రతి రోజూ గుడ్డు వడ్డిస్తున్నారు. సాయంత్రం స్నాక్స్ ఇలా పోషకాహారాన్ని అందిస్తున్నది.
‘మనబడి’ మరింత మెరుగు
వరండా, చెట్ల కింద విద్యాబోధనకు కాలం చెల్లింది. తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాల లేమి వంటి అవస్థలు దూరమవుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో అన్ని రకాల మౌలిక వసతులు సమకూరుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మనఊరు-మనబడి, మన బస్తీ – మనబడి కార్యక్రమంతో సర్కారు స్కూళ్లకు మహర్దశ పట్టింది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 351 పాఠశాలలను మనఊరు – మనబడి కార్యక్రమానికి ఎంపిక చేశారు. ఇందులో ప్రైమరీ పాఠశాలలు 186, అప్పర్ ప్రైమరీ 41, హైస్కూళ్లు 186 ఉన్నాయి. అత్యాధునిక బెంచీలు, గ్రీన్ చాక్‌బోర్డులు, విద్యుద్దీపాల వెలుగులు, ఆహ్లాదాన్ని పంచే ప్రాంగణాలు, అదనపు తరగతి గదులు, వంటశాలలు, వాష్బేషిన్లు, కంప్యూటర్ ల్యాబ్‌లు,సైన్స్ ప్రాజెక్ట్ ల్యాబ్‌లు,గ్రంథాలయం, తాగునీరు, చదువుపై ఆసక్తిని పెంచేలా పెయింటింగ్‌తో కూడిన ప్రహరీలు, టాయిలెట్స్, డైనింగ్ హాళ్లతో ప్రభుత్వ బడులు భళా అనేలా మారాయి. మొత్తానికి సర్కారు పాఠశాలలు నూతన ఒరవడిని సంతరించుకుంటున్నాయి.
కార్పొరేట్‌కు దీటుగా..
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్‌కు దీటుగా మారాయి. ప్రైవేటు పాఠశాలల్లో ఉండే అనేక రకాల వసతులతో సమానంగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందాయి. మనఊరు- మన బడి కార్యక్రమంతో జిల్లా వ్యాప్తంగా 351 పాఠశాలల రూపురేఖలు మారా యి. విశాలమైన తరగతి గదులు, డైనింగ్ హాల్, మైదానంతో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాం.
– రాజు, డీఈవో, కామారెడ్డి