మాచారెడ్డి, మార్చి 23 : వేసవికి ముందే నీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. రోజురోజుకూ భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పల్లెల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. బోర్లు వట్టిపోవడంతో సమీపంలోని పంట పొలాల నుంచి నీళ్లను తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. మండలంలోని అంకిరెడ్డిపల్లితండా గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్నది. గ్రామానికి తాగు నీరు అందించాల్సిన వాటర్ ట్యాంక్ నిరుపయోగంగా మారింది. తండాల్లో ఉన్న రెండు బోర్లు ఎత్తిపోవడంతో తండావాసులు దూరంలో ఉన్న పంట పొలాల నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు.
తండాలో ఒకటి వాటర్ ట్యాంక్ వద్ద , మరొకటి నర్సరీ వద్ద ఏర్పాటు చేసిన బోర్లు వట్టిపోవడంతో నీటి కష్టాలు తీవ్ర మయ్యాయి. తండాలో 60 కుటుంబాలు ఉండగా.. దాదాపు 350 వరకు జనాభా ఉన్నది. మిషన్ భగీరథ నీళ్లు వారానికి ఒకసారి కూడా వస్తాలేవని తండా వాసులు ఆందోళన చెందుతున్నారు. పనులు మానుకోని నీళ్లు తెచ్చుకుంటున్నారు.
అంకిరెడ్డిపల్లితండాలో నీటి సమస్య ఉన్నదని గ్రామస్తులు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. తండాలకు సమీపంలో ఉన్న పంట పొలాల వద్ద నుంచి నీళ్లను తెచ్చుకుంటున్నారు. పంట పొలాల వద్ద త్రీఫేస్ కరెంట్ ఉన్నప్పుడు మాత్రమే బోర్ల నుంచి నీళ్లు వస్తాయి. వరుసగా పదినిమిషాలు బోరు నడిచిందంటే చాలు మళ్లీ ఐదు నిమిషాలు ఆగాల్సి ఉంటుంది. వేసవికాలంలో తండాలో నీటి సమస్య తీవ్రతరం కానుండడంతో తండావాసులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు
ఇంట్లో ఏ పని చేసుకోవాలన్నా నీళ్లు అవసరం. మా తండాలో నీళ్ల కోసం చాలా ఇబ్బంది పడుతున్నం. పిల్లలను పట్టుకొని పంట పొలాల నుంచి బిందెలతో నీళ్లు తెచ్చుకుంటున్నం. మా ఇంటి వద్ద ఉన్న వాటర్ ట్యాంకు నుంచి నీళ్లు రాక చాలా రోజులైంది.
-గుగులోత్ విజయ, అంకిరెడ్డిపల్లితండా, మాచారెడ్డి మండలం
మా తండాలో వారానికి ఒకసారి కూడా నల్లనీళ్లు వస్త లేవు. నీళ్ల కోసం చాలా గోస పడుతున్నం. నీళ్ల కోసం మేము రెండు రోజులకోసారి పని మానాల్సి వస్తున్నది. ఎండ కాలంలో ఇప్పుడే నీళ్ల గోస ఇట్లా ఉంటే ఇంకా మూడు నెలలు ఎట్ల ఉంటుందో తెలియడంలేదు. మాకు నీళ్లు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నం.
-బానోత్ చంకి , అంకిరెడ్డిపల్లితండా, మాచారెడ్డి మండలం
మా తండాలో నీళ్లు అస్తలేవని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు.నీళ్లు లేక పిల్లలతో గోసగోస అవుతుంది. పంట పొలాల నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నం. వాళ్లు కూడా ప్రతిరోజూ ఇవ్వడం లేదు. మా పంట పొలాలకు నీళ్లు అందడంలేదని ఇబ్బంది పడుతున్నారు. పొలాల నుంచి నీళ్లు తెచ్చుకోవాలంటే ఇబ్బందిగా ఉన్నది.
-బానోత్ మున్ని, అంకిరెడ్డిపల్లితండా, మాచారెడ్డి మండలం