కామారెడ్డి, మార్చి 20 : కామారెడ్డి మండలం క్యాసంపల్లి తండాలో తాగునీటికి కటకట నెలకొన్నది. ఇక్కడ 250 కుటుంబాలు ఉంటే మూడు బోర్లే దిక్కయ్యాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో ఆ బోర్లు సరిగా పోయడం లేదు. పైపులు చెడిపోవడంతో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. దీంతో తాగునీటికి తండా వాసులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. బోర్ల నుంచి ఆగి ఆగి వస్తున్న నీటి కోసం ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా మహిళలు బారులు తీరుతున్నారు.
కేసీఆర్ పాలనలో ఇంటింటికీ నల్లా ద్వారా భగీరథ నీరు వచ్చేదని, ఇప్పుడు చుక్క నీరు రావడం లేదని తండా వాసులు తెలిపారు. జనంతో పాటు మూగ జీవాలకు సైతం నీరు దొరకడం లేదని వాపోయారు. మార్చిలోనే ఇలా నీటి కష్టాలు ఉంటే ఏప్రిల్, మే నెలల్లో మరిన్ని ఇక్కట్లు తప్పవని వాపోతున్నారు. సమస్య పరిష్కరించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్తే స్పందించడం లేదన్నారు.
తాగునీళ్ల కోసం మస్తు తండ్లాడుడు ఉన్నది. కేసీఆర్ ఉన్నప్పుడు ఏ రందీ లేకుండే. ఇంటికే నల్లా ద్వారా నీళ్లు అచ్చేటియ్. ఇప్పుడేమో నల్లలు అత్తలేవు. ఉన్న బోర్లు గట్లగట్లనే పోస్తున్నయ్. ఎండలు ముదరక ముందే గిట్లుంటే మున్ముందు ఎట్లుంటదో ఏమో భయమైతున్నది.
– అంబి, క్యాసంపల్లి తండా
బిందెడు నీళ్లు కావాలంటే మస్తు కష్టపడాల్సి అత్తున్నది. భగీరథ నీళ్లేమో అస్తలేవు. మా తండాల 250 కుటుంబాలు ఉంటే మూడు బోర్లే ఉన్నయి. అవి కూడా సక్కగా పోస్తలేవు. పోసే కొన్ని నీళ్లు ఎందుకు సరిపోతలేవు. అధికారులు కొత్త బోర్లు ఏయించాలి.
– తేజస్విని, క్యాసంపల్లి తండా
నీళ్ల కోసం మస్తు తిప్పలైతున్నది. పొద్దగాళ్ల లేసుడుతోటే బోర్ల కాడికి పోవాలే. నాలుగైదు బిందెలు కావాలంటే పట్టపగటి దాకా ఆడనే ఉండుడు అయితున్నది. పనులు ఇడ్స వెట్టుకుని నీళ్ల కోసం ఉంటున్నం. రోజూ గిట్లనే అయితే ఎట్ల బతకాలే. ప్రభుత్వమే పట్టించుకోవాలే.
– భుక్యా లక్ష్మి, క్యాసంపల్లి తండా