బాన్సువాడ, మార్చి 20: తాగునీటి కోసం తండాలు తల్లడిల్లుతున్నాయి. గుక్కెడు నీటి కోసం పల్లెలు పరితపిస్తున్నాయి. మిషన్ భగీరథ నీరు అరకొరగా సరఫరా అవుతుండడంతో జనం గొంతెండుతున్నది. భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎత్తిపోవడం, మోటర్లు మొరాయిస్తుండడంతో తాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతున్నది.
బిందెడు నీటి కోసం కిలోమీటర్ల మేర నడవాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది. వేసవి ఆరంభానికి ముందే ఉమ్మడి జిల్లాలో తాగునీటి ఇక్కట్లు మొదలయ్యాయి. మార్చి మొదటి వారం నుంచి సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. తాగునీరు ఇవ్వాలని ఇప్పటికే పలు గ్రామాల్లో పంచాయతీలను ముట్టడించారు. అధికారులను ఘెరావ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రానున్న రోజుల్లో పరిస్థితి తీవ్రంగా మారే ప్రమాదమున్నది.
పల్లె పల్లెన తాగునీటి సమస్యలు నెలకొన్నాయి. మంచినీటి కోసం మహిళలు బిందెలతో పొలాల్లోని బోర్ల వద్దకు పరుగులు తీస్తున్న దృశ్యాలు పదేండ్ల తర్వాత మళ్లీ కనిపిస్తున్నాయి. తాగునీటి ఇక్కట్లు శాశ్వతంగా తొలగించాలనే లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టారు. రూ.వేలాది కోట్లు వెచ్చించి ఊరూరికి పైపులైన్లు వేసి ప్రతి ఇంటికీ నల్లా ద్వారా నీళ్లిచ్చారు.
ఇంటికే శుద్ధ జలాలు రావడంతో మహిళలకు బిందెల మోత తప్పింది. అయితే, రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో మళ్లీ తాగునీటి ఇక్కట్లు మొదలయ్యాయి. గతంలో ఉదయం, సాయంత్రం గంటల కొద్దీ వచ్చిన మిషన్ భగీరథ నీళ్లు ఇప్పుడు కొన్ని గ్రామాల్లో అసలే రావట్లేదు. మరికొన్ని చోట్ల వస్తున్నా పట్టుమని పది నిమిషాలు కూడా సరఫరా కావట్లేదు. దీంతో తాగునీటి కోసం జనం అల్లాడుతున్నారు.
పెద్ద కొడప్గల్ మండలంలోని పోచారం తండా, కుబ్యానాయక్ తండా, విట్టల్ వాడి తండా, మన్సారం తండా వాసులు తాగునీటి కోసం కిలోమీటర్ దూరం నడవాల్సిన దుస్థితి నెలకొన్నది. బోర్ల నుంచి అరకొర నీరు వస్తుండడంతో పంటపొలాలకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నామని స్థానికులు వాపోతున్నారు.
బాన్సువాడ డివిజన్లోని బాన్సువాడ, పెద్ద కొడప్గల్, పిట్లం, జుక్కల్ తదితర మండలాల్లో తాగునీటి ఇబ్బందులు తీవ్రంగా ఉన్నాయి. బాన్సువాడ మండలంకాద్లాపూర్లో ఉదయం కొద్దిసేపు మాత్రమే భగీరథ నీరు వస్తున్నదని, అవి ఏమాత్రం సరిపోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. పంటపొలాలకు వెళ్లి బోర్ల నుంచి బిందెల ద్వారా నీళ్లు తెచ్చుకుంటున్నామని చెప్పారు. సంగ్రాం నాయక్ తండాలో భూగర్భ జలాలు అడుగంటడంతో బోరు నుంచి నీళ్లు సరిగా రావడం లేదు. వారంలో ఎత్తిపోయే అవకాశమున్నదని, రైతుల బోరును ముందే అద్దెకు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
అవాజ్పల్లి తండాలో సింగిల్ ఫేజ్ మోటర్ బోరులోనే పడిపోవడంతో తాగునీరు రాక ఇబ్బందులు పడుతున్నామని తండా వాసులు తెలిపారు. పెద్ద కొడప్గల్ మండలంలోని మన్సారం తండాలో మిషన్ భగీరథ నీరు సరిగా రావట్లేదు. దీంతో తడ్కల్ నుంచి సముందర్ తండాకు వెళ్లే దారిలో ఉన్న పైప్‌లైన్ మ్యాన్‌హోల్ నుంచి చేతులు అడ్డుపెట్టి నీటిని తెచ్చుకుంటున్నామని స్థానికులు చెప్పారు. పోచారం తండాలోనూ మిషన్ భగీరథ నీరు సరిగా రావడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పిట్లం మండలంలోని కాటేపల్లిలో భగీరథ నీరు రాకపోవడంతో ట్యాంకర్ ద్వారా నీళ్లు సరఫరా చేస్తున్నారు. జుక్కల్ మండలంలోని గుండూర్లో వారం రోజులుగా నీరు రాకపోవడంతో జీపీ కార్యదర్శిని గ్రామస్తులు ఘెరావ్ చేశారు.
తాగునీటి కోసం మస్తు తిప్పలైతున్నది. మిషన్ భగీరథ నీళ్లు సరిగా అత్తలేవు. తండాల సింగిల్ ఫేజ్ మోటర్లు, చేతి పంపులు లేవు. తాగేతందుకు నీళ్లు లేకుంటే ఎట్ల? పిల్లలను వెంటేసుకుని కిలోమీటర్ దూరం నడిచి నీళ్లు పట్టుకొచ్చుకుంటున్నం. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని తడ్కల్ గ్రామం నుంచి పెద్ద కొడప్గల్ మండలంలోని సముందర్ తండాకు సరఫరా అయ్యే పైపులైన్ మ్యాన్‌హోల్ నుంచి నీళ్లు పట్టుకుంటున్నం.
– పేల్యా సీత, మన్సారం తండా వాసి
తండాలో తాగటానికి మంచి నీళ్లు లేవు. భగీరథ నీళ్లు అస్తలేవు. ఆడోళ్లు కిలోమీటర్ దూరం పోయి బిందెలల్ల మోసుకొస్తుండ్రు. పొద్దున లేవంగానే నీళ్ల కోసం నడుసుకుంట పోవాలె. రెండు, మూడు బిందెలు నెత్తిన పెట్టుకుని రావాలే. అధికారులు పట్టించుకోవాలే. మా సమస్య తీర్చాలే.
– జాదవ్ హరీశ్‌నాయక్, మనసరాం తండా వాసి