ఖలీల్వాడి, డిసెంబర్ 2 : ఓటరు జాబితాలో అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా తప్పిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. జాబితాలో పేర్లను తొలగించే ముందు, అందుకు గల కారణాలను పక్కాగా నిర్ధారించుకోవాలన్నారు. జిల్లా అధికారులతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఓటరు జాబితాలో డూప్లికేట్ పేర్లు లేకుండా క్షుణ్ణంగా పరిశీలన చేపట్టాలని ఆదేశించారు. అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇతర ప్రాంతానికి వలస వెళ్లిన వారి పేర్లు కొత్త ప్రదేశంలో నమోదు చేసుకున్నారా అని నిర్ధారణ చేసుకున్న తర్వాత జాబితా నుంచి తొలగించాలని అన్నారు. మృతి చెందిన వారి పేర్లను కూడా స్పష్టమైన నిర్ధారణ చేసుకున్న మీదట తొలగించాలని సూచించారు.
18-19 సంవత్సరాలు, 20-29 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన ఓటర్ల సంఖ్యను నిర్ధారించుకునేందుకు క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి వివరాలను సేకరించాలని సూచించారు. 2003 జనవరి 1 నుంచి 2005 జనవరి 1 తేదీ మధ్యన జన్మించిన వారితో పాటు 1993, జనవరి 1 నుంచి 2023 జనవరి 1 మధ్యన జన్మించిన వారిగా వివరాలను వేర్వేరుగా సేకరించి ప్రత్యేక రిజిష్టర్లో నమోదు చేయాలన్నారు. స్థానికంగా ఉంటున్నారా లేక ఏదైనా ఇతర ప్రాంతానికి వలస వెళ్లారా అనే వివరాలను సేకరించాలన్నారు. 18 సంవత్సరాలు, అంతకన్నా ఎక్కువ వయస్సు కలిగిన యువతను ఓటరు జాబితాలో చేర్చేందుకు వీలుగా జిల్లాలోని అన్ని కళాశాలల్లో విస్తృతస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నీలేశ్ వ్యాస్ జిల్లా కలెక్టర్లతో కొత్త ఓటర్ల నమోదు, జాబితాలో మార్పులు, చేర్పులు తదితర అంశాలపై శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. గత నెల నవంబర్ 9 నుంచి 30 వరకు స్వీకరించిన దరఖాస్తులు ఎన్ని, వాటిలో ఇంకా ఎన్ని ఆవిష్కృతంగా ఉన్నాయి, ఇదివరకు జాబితాతో పోలిస్తే ప్రస్తుతం కొత్తగా పెరిగిన ఓటర్ల శాతం ఎంత, వాస్తవ జనాభా లెక్కలకనుగుణంగా 18 సంవత్సరాలు పైబడిన వారందరూ ఓటరుగా పేర్లను నమోదు చేసుకున్నారా, అవగాహన కార్యక్రమాలు తదితర అంశాలపై ఆరా తీస్తూ కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్, జడ్పీ సీఈవో గోవింద్, డీఆర్డీవో చందర్, ఆర్డీవోలు రవి, రాజేశ్వర్, శ్రీనివాస్, ఎన్నికల విభాగం అధికారులు పవన్, సాత్విక్ తదితరులు పాల్గొన్నారు.