బోధన్, సెప్టెంబర్ 2: కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులు.. వారి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రంలో తెలంగాణ సంక్షేమ పథకాలు ఎందుకు అమలుచేయడంలేదని బోధన్ ఎమ్మెల్యే షకీల్ ప్రశ్నించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బోధన్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 123 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, 63 మందికి షాదీ ముబారక్ చెక్కులను శనివారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, రైతు బంధు, రైతుబీమా పథకాలు లేవన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు.
ప్రజలు అభివృద్ధిని కాంక్షించే పార్టీలను ఆదరించాలని కోరారు. ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీల నాయకులు ఓట్లకోసం వస్తారని, వారిని ‘తెలంగాణ లో అమలు చేస్తున్న సంక్షే మ పథకాలు మీ పార్టీలు పరిపాలించే రాష్ట్రాల్లో ఎందుకు అమలు కావడం లేదు..’ అని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం పిల్లల పుట్టుక నుంచి వారి వివాహాలు, ఉన్నత చదువుల కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ గొప్ప విజన్ ఉన్న నాయకుడని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ వీఆర్ దేశాయ్, జడ్పీ వైస్ చైర్పర్సన్ రజితాయాదవ్, డీసీసీబీ డైరెక్టర్ గిర్దావర్ గంగారెడ్డి, బీఆర్ఎస్ బోధన్ పట్టణ, మండల అధ్యక్షుడు రవీందర్ యాదవ్, సంజీవ్ కుమార్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బెంజర్ గంగారాం, ఎడపల్లి ఎంపీపీ కొండెంగల శ్రీనివాస్, బోధన్ విండో చైర్మన్ ఉద్మీర్ లక్ష్మణ్, బీఆర్ఎస్ ఎడపల్లి మండల అధ్యక్షుడు దేరెడి శ్రీరాం, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఏ వాహబ్ (భారీ ), ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరికలు
రెంజల్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలకు చెందిన యువకులు శనివారం ఎమ్మెల్యే షకీల్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మేదరి లింగయ్య, నాని, పల్లపు రాజు, లక్ష్మణ్, సంపత్, శ్రీను, శివ, పరుశురాం, శ్రీకాంత్, సాయిలు, శంకర్, దండు సాయిలు బీఆర్ఎస్లో చేరగా.. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.