సుభాష్‌నగర్, అక్టోబర్ 2: దసరా.. హిందువులకు ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు.. పదో రోజు విజయదశమిని కలిపి దసరా అంటారు. ప్రధానంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అంటారు. శరదృతువులో వచ్చే పండుగ కాబట్టి ఈ పేరు వచ్చింది. నవరాత్రి అనే పదం శబ్దార్థ ప్రకారంగా.. సంస్కృతంలో తొమ్మిది రాత్రులని అర్థం. ఈ తొమ్మిది రాత్రులు.. పది రోజుల్లో.. తొమ్మి ది రూపాల్లో ఉన్న శక్తి (అమ్మవారు)ని ఆరాధిస్తారు.
కొందరు ఈ పండుగ మొదటి మూడు రోజులు పార్వతీదేవిని, తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవిని, ఆ తర్వాత మూడు రోజులు సరస్వతీ మాతకు పూజలు నిర్వహిస్తారు. నవరాత్రుల్లో సామాన్యుల నుంచి యోగుల వరకు అమ్మవారిని పూజిస్తారు. తొమ్మిది రోజుల్లో అమ్మవారు తొమ్మిది రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. లోక కల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపంలో దర్శనమిస్తారు. ప్రకృతి ఆధీనంలో ఉండాలని, అందరూ క్షేమంగా ఉండాలని అమ్మవారిని వేడుకుంటారు. ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేసి అందులో అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించి తొమ్మిది రోజుల పాటు ఉదయం, సాయంకాలం రెండుసార్లు భక్తిశ్రద్ధలతో దేవీ మాతకు పూజలు, అర్చనలు చేస్తుంటారు.
యువజన మండళ్లు, మహిళా మండళ్ల వారు అమ్మవారి మండపాల వద్ద రాత్రుళ్ల్లు భజనలు, కోలాటాలు ఆడుతుంటారు. బతుకమ్మ ఆటలను ఆడుతూ అమ్మను కొలుస్తారు. చండీ హోమాలు, శ్రీలక్ష్మీగణపతి, దుర్గా రుద్రహోమాలు నిర్వహిస్తారు. మండపాల వద్ద శ్రీలలితా సహస్రనామ పారాయణాలు, దేవీ ఖడ్గమాల పారాయణాలు చేస్తూ అమ్మవారిని ఆరాధిస్తారు. దశమి పర్వదినాలను జరుపుకోవాలని వేదపండితులు సూచిస్తున్నారు. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా మాలధారణ వేసుకోవడానికి జిల్లాలో యువకులు సిద్ధమయ్యారు. తొమ్మిది రోజుల పాటు నియమ నిష్టలతో ఆధ్యాత్మిక చింతన ద్వారా మానసిక ప్రశాంతత ప్రాప్తిస్త్తుంది.