కోటగిరి, జూలై 24: ప్రభుత్వం మంజూరుచేసిన అభివృద్ధి పనులను వారం రోజుల్లో ప్రారంభించాలని, ఒకవేళ ప్రారంభించని పక్షంలో పనులను రద్దుచేస్తామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రూ.500 కోట్లతో బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కోటగిరి మండల కేంద్రంలో కోటగిరి, పొతంగల్ మండలాల్లో అభివృద్ధి పనులపై వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌తో మాట్లాడి ఒప్పించి బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎస్డీఎఫ్ కింద రూ.500 కోట్లు తీసుకొచ్చి పనులు మంజూరు చేస్తే .. కొన్నిచోట్ల ఇప్పటివరకూ పనులను ప్రారంభించకపోవడమేంటని ప్రశ్నించారు. వారంలో పనులు ప్రారంభించకుంటే రద్దు చేస్తామని స్పష్టం చేశారు. చేసిన పనులకు బిల్లులు కూడా సకాలంలో వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు నిధుల కోసం ఎదురు చూసేవాళ్లమని, అయినా కూడా ఎప్పుడో ఒకసారి నియోజకవర్గానికి రూ.50లక్షలు మాత్రమే ఇచ్చేవారని గుర్తుచేశారు. ఆనాడు ప్రతి రూపాయికి కష్టం ఉండేదని, కానీ తెలంగాణ వచ్చాక నిధుల కొరత లేదన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజకవర్గానికి అత్యధిక నిధులు వచ్చాయని తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్నాయని, మంజూరైన పనులను వేగవంతం చేయాలన్నారు.అంతకు ముందు రైతు వేదిక వద్ద ముగ్గురు లబ్ధిదారులకు షాదీ ముబారక్ చెక్కులను స్పీకర్ అందజేశారు.
కోటగిరి, పొతంగల్ మండల కేంద్రాల్లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి స్పీకర్ కేక్ కట్ చేసి సంబురాలు చేసుకొన్నారు. కేటీఆర్ నిండు నూరేండ్లు సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుడిని కోరారు.
సీఎం కేసీఆర్ మరోసారి దివ్యాంగులకు పింఛన్ పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తూ దివ్యాంగులు సోమవారం కోటగిరిలో కేసీఆర్, పోచారం శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
కోటగిరిలో నిర్మిస్తున్న మైనార్టీ రెసిడెన్షియల్ భవన నిర్మాణ పనులను స్పీకర్ పోచారం పరిశీలించారు. పనులను వేగవంతం చేసి ఆగస్టు 10లోపు అందుబాటులోకి తీసుకురావాలని, ఆగస్టు 15న ప్రారంభోత్సవం చేస్తామని తెలిపారు. అనంతరం పొతంగల్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామాల వారీగా అభివృద్ధి పనులపై వివరాలను అడిగి తెలుసుకొన్నారు. ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి, జడ్పీటీసీ శంకర్‌పటేల్, బోధన్ ఆర్డీవో రాజాగౌడ్, ఏసీపీ కిరణ్‌కుమార్, సర్పంచులు పత్తి లక్ష్మణ్, వర్ని శంకర్, జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ సిరాజ్, ఏఎంసీ చైర్మన్ మహ్మద్ అబ్దుల్ హమీద్, వైస్ చైర్మన్ రాంరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ వల్లేపల్లి శ్రీనివాసరావు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కొల్లూర్ కిశోర్‌బాబు, కోటగిరి విండో చైర్మన కూచి సిద్దూ, మండల కన్వీనర్ ఎజాజ్‌ఖాన్, మండల కో-ఆప్షన్ మెంబర్ ఇస్మాయిల్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
బీర్కూర్, జూలై 24: పొతంగల్, కోటగిరి మండలాల్లో సోమవారం పలు కార్యక్రమాలకు హాజరై బీర్కూర్‌కు వచ్చిన సభాపతికి స్థానిక కామప్ప కూడలి వద్ద వర్షంలో తడుస్తున్న విద్యార్థులు, ప్రయాణికులను గమనించారు. వెంటనే తన వాహనాన్ని ఆపి వారి సమస్యలను తెలుసుకొన్నారు. బస్సులు సమయానికి రావడంలేదని వారు స్పీకర్ దృష్టికి తీసుకెళ్లాగా..వెంటనే బాన్సువాడ ఆర్టీసీ డీఎం సదాశివ్‌కు ఫోన్‌చేసి ఆగ్రహం వ్యక్తంచేశారు. చాలాసేపటి నుంచి విద్యార్థులు, ప్రయాణికులు బస్సు కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం ఆర్టీసీ సేవలను విస్తరిస్తున్నా సమయానికి బస్సులు ప్రజలకు అందుబాటులో లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. మరోసారి సమయానికి బస్సులు రాకపోతే పైఅధికారులకు ఫిర్యాదు చేస్తానని డీఎంను హెచ్చరించారు.