కోటగిరి, ఫిబ్రవరి 5 : రాష్ట్రంలోని ఆలయాలు సీఎం కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి చెందుతున్నాయని, ఈ మేరకు ఆయన ఎనలేని కృషి చేస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని జల్లాపల్లిఫారంలో శనివారం నిర్వహించిన జగదాంబ, సేవాలాల్ మహరాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో స్పీకర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు. లబ్ధిదారుల ఎంపికలో పైరవీలకు తావులేకుండా చూడాలని, అర్హులకు ఇండ్లు మంజూ రు చేయాలని అధికారులను ఆదేశించారు. మార్చి నుంచి 57 ఏండ్లవారికి కూడా పింఛన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎన్ఎస్ఎఫ్ భూ సమస్య కొంతఉందని లబ్ధిదారులు విన్నవించడంతో స్పందించిన స్పీకర్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని బోధన్ ఆర్డీవో రాజేశ్వర్‌ను ఆదేశించారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ అమీనాబీ షేరు, ఎంపీపీ వల్లెపల్లి సునీత, జడ్పీటీసీ శంకర్‌పటేల్, ఎంపీటీసీ రాములు, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు సిరాజ్, ఆర్డీవో రాజేశ్వర్, తహసీల్దార్ విఠల్, ఎంపీడీవో మహ్మద్ అతారుద్దీన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎజాజ్‌ఖాన్, బంజారా సంఘం జిల్లా అధ్యక్షుడు బద్యానాయక్, మండల నాయకులు పాల్గొన్నారు.