కామారెడ్డి, డిసెంబర్ 1 : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్ సమీపంలో గల ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలను మున్సిపల్ అధికారులు సోమవారం తొలగించారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల సహకారంతో ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం వరకు నిర్మాణాలను కూల్చేశారు. సర్వే నంబర్ 6లో కొందరు అక్రమంగా కట్టుకున్న దుకాణాలు, షెడ్లను జేసీబీలతో తొలగించారు. ఎన్నో ఏళ్లుగా ఈ దుకాణాలనే జీవనాధారంగా చేసుకుని బతుకున్నామని, ఇప్పుడు ఇలా తొలగించడం సరికాదని బాధితులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.
గత 25 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని, పన్నులు కూడా కడుతున్నామని, ఇప్పుడు ఉన్నట్టుండి వెళ్లిపొమ్మంటే ఎలా? అని వాపోయారు. కోర్టు నుంచి స్టే ఉన్నా కూడా మున్సిపల్ అధికారులు ఇలా తొలగించడం సరికాదని బాధితులు పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టడంతోనే తాము కూల్చేశామని మున్సిపల్ అధికారులు తెలిపారు. ఈ మేరకు గత వారం నోటీసులు ఇచ్చామని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి, టీపీవో గిరిదర్ కుమార్, తహసీల్దార్ జనార్దన్, పోలీసులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.